Taylor Swift Deepfake: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మాట్లాడారు. ఏఐని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి టెక్నాలజీ కంపెనీలు వేగంగా పని చేయాలన్నారు. అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌కు సంబంధించి ఏఐ ద్వారా జనరేట్ చేసిన అభ్యంతరకరమైన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు.


ఛాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఇటీవలే సొంత ఏఐ ప్లాట్‌ఫాం కోపైలట్‌ను కూడా మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. టేలర్ స్విఫ్ట్ ఇమేజెస్ గురించి మాట్లాడుతూ అవి చాలా భయంకరంగా ఉన్నాయని తెలిపారు. ఏఐని దుర్వినియోగం చేయకుండా ‘గార్డ్ రెయిల్స్’ను ఉపయోగించాలని అన్నారు.


‘మనందరం స్పందించారు. ఒక సమస్యపై మీరు ఎలా స్పందిస్తున్నారనే దాంతో సంబంధం లేకుండా టెక్ ప్లాట్‌ఫాంలో ఉండే వారందరూ దీనిపై స్పందించాలి. ఆన్‌లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచితేనే మనం అందరం ప్రశాంతంగా ఉంటాం.’ అని ఎన్‌బీసీ నైట్లీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల అన్నారు.


‘ఏమాత్రం సురక్షితంగా లేని ఆన్‌లైన్ ప్రపంచంలో బతకాలని ఎవరూ కోరుకోరని నేను అనుకుంటున్నాను. కంటెంట్ క్రియేటర్లకు, ఆ కంటెంట్‌ను చూస్తున్న, వింటున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. మనం దీనిపై వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది.’ అని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.


టేలర్ స్విఫ్ట్ ఫొటోలపై నెలకొన్న వివాదం ఎంతో తీవ్రమైన స్థాయికి చేరుకుంది. ఏఐ ‘డీప్‌ఫేక్’ టెక్నాలజీపై చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ప్రముఖులు అంటున్నారు. ‘నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా మనం ఒక్కసారి వెనక్కి వెళ్లి మన బాధ్యత ఏంటి అనేది ఆలోచించాలి. టెక్నాలజీని సురక్షితంగా ఉంచి సేఫ్ కంటెంట్‌ను క్రియేట్ చేసే ప్లాట్‌ఫాం ఒకటి కావాలి. దానికి సంబంధించి మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఇది ప్రపంచ, సామాజిక స్థాయిలో ఉంది. కాబట్టి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. లా ఎన్‌ఫోర్స్‌మెంట్, టెక్ ప్లాట్‌ఫాంలు ఈ అంశంపై ఏకతాటిపైకి రావాలి. ఈ విషయంలో మనం అనుకున్నదాని కంటే ఎక్కువ సాధించగలం.’ అని సత్య నాదెళ్ల అన్నారు.


మరోవైపు మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగాల్లో మరో కీలక అడుగు పడింది. తొలిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్ అమర్చినట్లు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మంగళవారం వెల్లడించారు. ఆ వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. ప్రారంభ ఫలితాల్లోనే స్పష్టమైన 'న్యూరాన్ స్పైస్ డిటెక్షన్'ను గుర్తించినట్లు పేర్కొన్నారు. మనిషి మెదడుకు, కంప్యూటర్‌కి మధ్య నేరుగా సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ సారథ్యంలో 'న్యూరాలింక్' సంస్థ 2016లో ఏర్పాటైంది. మానవ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే దీని లక్ష్యమని మస్క్ తెలిపారు. మనిషికి, ఏఐకు మధ్య సాంకేతిక సంబంధం బలపరిచేలా ఈ చిప్ సాయపడుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. మనిషి మెదడులో చిప్ అమర్చామని, ఆ వ్యక్తి క్రమంగా కోలుకుంటున్నాడని మస్క్ 'X' (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!