రిలయన్స్ జియో తన కొత్త ఇండిపెండెన్స్ డే 2023 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.2,999గా ఉంది. ఈ ప్లాన్ ద్వారా కాలింగ్, డేటా లాభాలు కూడా లభించనున్నాయి. ఫుడ్ డెలివరీ సర్వీసులు, ట్రావెల్ రిజర్వేషన్లు, ఆన్‌లైన్ షాపింగ్‌లపై డిస్కౌంట్లు కూడా అందిస్తున్నారు.
జియో ఇండిపెండెన్స్ డే 2023 ప్లాన్ ద్వారా లభించే లాభాలు ఏంటి?
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.2,999గా ఉంది. దీని వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి లాభాలు లభించనున్నాయి. అంటే మొత్తంగా 912.5 జీబీ డేటా లభించనుందన్న మాట. దీంతోపాటు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అదనపు లాభాలు ఇవే...
ఒకవేళ మీరు స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే రూ.100 డిస్కౌంట్ లభించనుంది. కానీ దానికి రూ.249 పైన ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ‘యాత్ర’ ద్వారా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాత్రలో డొమిస్టిక్ హోటల్ బుకింగ్స్ చేసుకుంటే 15 శాతం (రూ.నాలుగు వేల వరకు) డిస్కౌంట్ అందించనున్నారు.
అజియో షాపింగ్‌లో రూ.200 డిస్కౌంట్ లభించనుంది. కానీ దానికి రూ.999 పైగా షాపింగ్ చేయాల్సి వస్తుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా ఎంపిక చేసిన ఆడియో యాక్సెసరీస్, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనుంది.
మరోవైపు జియోబుక్ 2023 ల్యాప్‌టాప్ సేల్ భారతదేశంలో ఇటీవలే ప్రారంభం అయింది. టెలికాం రంగం దిగ్గజం జియో లాంచ్ చేసిన రెండో తరం ల్యాప్‌టాప్ ఇదే. ఈ ల్యాప్‌టాప్‌ను కంపెనీ ప్లాస్టిక్ బాడీతో రూపొందించింది. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8788 ప్రాసెసర్‌పై జియోబుక్ 2023 ల్యాప్‌టాప్ పని చేయనుంది. జియో బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని లాంచ్ చేసింది.
ఇన్‌బిల్ట్ సిమ్ కార్డుతోనే ఈ జియోబుక్ 2023 రానుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్‌డీఎంఐ మినీ పోర్టు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను జియోబుక్ 2023 అందించనుంది.
జియోబుక్ 2023 ధర ఎంత?
జియోబుక్ 2023 ధరను మనదేశంలో రూ.16,499గా నిర్ణయించారు. జియో బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, రిలయన్స్ డిజిటల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో జియోబుక్ 2023 అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. రిలయన్స్ జియోబుక్ మొదటి తరం ల్యాప్‌టాప్ 2022 అక్టోబర్‌లో మనదేశంలో లాంచ్ అయింది. జియోబుక్ మొదటి వెర్షన్ ధర లాంచ్ అయినప్పుడు రూ.15,799గా నిర్ణయించారు.
Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial