TTE In Train Toilet: భారతీయ రైళ్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ దారుణంగా ఉంటుంది. జనరల్ బోగీ పరిస్థితి మరీ దారుణం. అధ్వాన్నమైన మరుగుదొడ్లు ఉంటాయి. నీటి వసతి ఉండదు. మరి కొన్ని రైళ్లలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంటుంది. అప్పుడప్పుడు బోగీల్లో బొద్దింకలు, బల్లులు కూడా కనిపిస్తాయి. కొన్ని బోగీల్లో లైట్లు ఉండవు. కొన్నింటిలో ఫ్యాన్లు ఉండవు. మరికొన్నింటిలో విద్యుత్ వసతి ఉండదు. ప్రయాణికులు అన్నీ భరిస్తూ, సర్దుకొని ప్రయాణం చేస్తుంటారు.
కానీ సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీల్లో కరెంట్ లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కలెక్టర్‌ను (టీటీఈని)ని టాయిలెట్‌లోకి లాక్కెళ్లి బంధించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ వైపు సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. ప్రయాణంలో బీ1, బీ2 కోచ్‌లలో విద్యుత్ వైఫల్యం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు టిక్కెట్ కలెక్టర్ (టీటీఈ)ని టాయిలెట్‌లోకి లాక్కెళ్లారు.
విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రయాణికులతో చర్చించారు. విద్యుత్తు సమస్య త్వరగా పరిష్కరిస్తామని ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికులకు హామీ ఇచ్చారు. రైలు తుండ్ల స్టేషన్‌లో ఉండగా రైల్వే ఇంజనీర్లు B1 కోచ్‌లో విద్యుత్‌ను పునరుద్ధరించారు. B2 కోచ్‌లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు.
భారత రైల్వే గురించి తెలుసా?
ఆసియా ఖండంలోనే భారతదేశం రైలు నెట్‌వర్క్ అతి పెద్దది. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. భారతదేశంలో రోజుకు వేల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో లక్షల మంది ప్రజలు ప్రయాణిస్తారని అంచనా. ఆస్ట్రేలియా జనాభాతో సమానమైన ప్రయాణికులు భారతదేశంలో ప్రతిరోజూ రైలులో ప్రయాణిస్తారు.
వాణిజ్య మంత్రిత్వ శాఖ ట్రస్ట్ ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (IBEF) ప్రకారం, దేశంలో ప్రతిరోజూ సుమారు 22,600కు పైగా రైళ్లు నడుస్తున్నాయి. దేశంలోని 7,325 స్టేషన్లను కలుపుతూ 13,452 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్ల ద్వారా రోజూ 2.40 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మిగతా సంఖ్యలో రైళ్లలో అన్ని రకాల మెయిల్, ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
ఇది కాకుండా, రైల్వే ప్రతిరోజూ దాదాపు 9,141 గూడ్స్ రైళ్లను నడుపుతోంది. వాటి ద్వారా దేశంలోని నలుమూలల నుంచి సరుకులు రవాణా అవుతాయి. రైల్వేల రోజువారీ సరుకు రవాణా సంఖ్య కూడా దాదాపు 20.38 కోట్ల టన్నులు. గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైళ్లు కలిపి రోజూ దాదాపు 67,368 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.