IRCTC Services Down: భారతీయ రైల్వే యాప్, వెబ్‌సైట్ గురువారం పనిచేయకపోవడంతో టిక్కెట్ల బుకింగ్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్‌లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఐఆర్‌సీటీసీ డౌన్‌లో ఉన్నట్లు చాలా నివేదికలు అందాయి. డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఉదయం 10:25 గంటల ప్రాంతంలో అత్యధిక ఫిర్యాదులు అందాయి.

Continues below advertisement


ప్రధానంగా న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, ముంబై, మధురై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, జైపూర్, లక్నో, కోల్‌కతాకు చెందిన వ్యక్తులు యాప్ డౌన్‌లో ఉన్నట్లు నివేదించారు. ఐఆర్‌సీటీసీ యాప్‌ని ఓపెన్ చేయగానే 'Unable to perform action due to maintenance activity' అని ఎర్రర్ కనిపిస్తుంది. దీనిపై ఇప్పటి వరకు రైల్వేశాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.


సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్న ప్రజలు
ఐఆర్‌సీటీసీ డౌన్ అయిందని సోషల్ మీడియాలో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీని ఇన్వెస్టిగేట్ చేయాలని ఒక యూజర్ రాశారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ హబ్ అయినప్పటికీ వెబ్ సైట్ సమస్యను పరిష్కరించలేకపోయిందని అని మరొక యూజర్ రాశారు. మీరు పన్ను వసూలు చేయవచ్చు కానీ ప్రతిఫలంగా మంచి సేవలను అందించలేరని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద అంతరాయం
భారతీయ రైల్వేలలో ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద అంతరాయం. అంతకుముందు డిసెంబరు 9వ తేదీన మరమ్మతుల కారణంగా ఇ-టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ఒక గంట పాటు ఆగిపోయింది. ఈ సమయంలో కూడా తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి మీద ఎక్కువగా ప్రభావం పడింది.


తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాలనుకునే వ్యక్తులు కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తన అడ్వైసరీలో పేర్కొంది. ఇది కాకుండా వారు టికెట్ డిపాజిట్ రసీదు (TDR) కోసం ఇమెయిల్ చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ సంప్రదించడానికి 14646, 08044647999, 08035734999 నంబర్‌లను అందించింది. టిక్కెట్‌కి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి etickets@irctc.co.inకి ఈమెయిల్ పంపవచ్చు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!