Apple iPhone SE 4: యాపిల్ కొత్త ఐఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇది ఒక చవకైన ఫోన్ అని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ తర్వాతి తరం ఫోన్ అయిన ఐఫోన్ ఎస్ఈ 4ను కంపెనీ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర కూడా చాలా తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. రాబోయే ఈ కొత్త ఐఫోన్‌లో సరికొత్త ఫీచర్లను అందించడం పెద్ద విషయం. దీనితో పాటు శక్తివంతమైన చిప్‌సెట్‌ను కూడా కంపెనీ అందించనుందని తెలుస్తోంది. లాంచ్ కాకముందే ఈ ఫోన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.


9To5Mac నివేదిక ప్రకారం ఐఫోన్ ఎస్ఈ 4... 2025లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ ఫోన్‌లో చాలా పెద్ద మార్పులను చూడవచ్చు. ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్‌లో కంపెనీ అందించనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. దీంతో పాటు రాబోయే ఫోన్‌లో ఐవోఎస్ 18 అప్‌డేట్‌ను కూడా కంపెనీ అందించనుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 35 వేల నుంచి ప్రారంభం అవుతుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఐఫోన్ ఎస్ఈ 4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
ఐస్ యూనివర్స్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ ఐఫోన్ ఎస్ఈ 4 లీక్డ్ వివరాలను షేర్ చేశారు. దీని ప్రకారం ఐఫోన్ ఎస్ఈ 4 వెనుక ప్యానెల్‌లో ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ ఐఫోన్ 16 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉండవచ్చని లీక్ అయిన వివరాలను బట్టి చెప్పవచ్చు. ఐఫోన్ ఎస్‌ఈ 4లో యాపిల్ 6.06 అంగుళాల డిస్‌ప్లేను అందించనుంది. ఈ కొత్త మోడల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం మునుపటి లాగా 60 హెర్ట్జ్‌నే ఉండనుందని సమాచారం.


ఈ ఫోన్‌లో ఏ18 చిప్‌సెట్‌ని పొందవచ్చు. 6 జీబీ లేదా 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ అందించే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ ఎస్ఈ 4లో సెక్యూరిటీ కోసం ఫేస్ ఐడీ కూడా అందించనున్నారు. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఐఫోన్ లైనప్ తరహాలోనే యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.


యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఇటీవలే మంచి ఆఫర్ అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.70,990 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఏకంగా రూ.60 వేల చేరువకు కూడా దీని ధర వచ్చింది. ఐఫోన్ 13ను అయితే ఏకంగా రూ.47 వేలకు విక్రయించారు. ఈ సేల్‌లో ఐఫోన్ 13ను చాలా మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. అలాగే సెప్టెంబర్‌లో బ్రాండ్ న్యూ ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి రానుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. అయితే ఐదో ఫోన్ కూడా ఇందులో అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే!



Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?