ఇన్ స్టంట్ వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారత్ లో భారీ స్థాయిలో వినియోగదారులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా యూజర్లతో.. ప్రపంచంలోనే అత్యధిక యూజర్ బేస్ ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారత యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. వాట్సాప్ చాటింగ్ మరింత ఈజీగా కొనసాగించేలా నూతన అప్ డేట్స్ తీసుకొస్తుంది. అందులో భాగంగా వచ్చినవే స్టిక్కర్స్.  టెక్ట్స్ టైప్ చేయకుండానే.. చెప్పాలనుకున్న విషయాన్ని ఈజీగా ఒక స్టిక్కర్ తో చెప్పే అవకాశం కల్పించింది. ఈ స్టిక్కర్స్ అందుబాటులోకి వచ్చాక.. చాలా మంది యూజర్లకు టెక్ట్స్ టైప్ చేసే ఇబ్బంది తప్పిందని చెప్పుకోవవచ్చు.


ఇక పండుగల సీజన్ లో శుభాకాంక్షలు చెప్పడానికి వినియోగదారులు ఎక్కువగా వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగిస్తారు. వాస్తవానికి వాట్సాప్ స్టిక్కర్లు చాలా కాలంగా ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లో దసరా, దీపావళి, దుర్గాపూజ, నవరాత్రులు సహా పలు పండుగల సందర్భాల్లో స్టిక్కర్ ప్యాక్ లను యాక్సెస్ చేయడానికి పలు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్ని స్టిక్కర్స్ ఉన్నా.. సొంత ఫోటోను స్టిక్కర్ గా మార్చుకుని పంపిస్తే కలిగే థ్రిల్ వేరేలా ఉంటుంది. ఇదే ఆలోచనతో కస్టమ్ వాట్సాప్ స్టిక్కర్ ను రూపొందించునే వెసులుబాటును గతేడాది అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. జస్ట్ కొన్ని క్లిక్స్ తో సొంత ఫోటోను వాట్సాప్ స్టిక్కర్ గా మార్చుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం జస్ట్ వాట్సాప్ వెబ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, డెస్క్ టాప్ లో రూపొందించిన స్టిక్కర్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది.


వాట్సాప్ స్టిక్కర్ క్రియేటర్ ద్వారా వ్యక్తిగత స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. దీనికి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు. ఇది వాట్సాప్ యాప్ లోని ఫీచర్. వాట్సాప్ ఫీచర్ ఎమోజి, అవుట్‌ లైన్, స్టిక్కర్, టెక్స్ట్, పెయింట్,  క్రాప్, రొటేట్ సహా పలు ఎడిటింగ్ టూల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  సందర్భానుసారంగా సరైన  WhatsApp స్టిక్కర్‌ను రూపొందించడానికి ఈ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడుతాయి. ఈ పండుగ సీజన్‌లో కస్టమ్ వాట్సాప్ స్టిక్కర్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవడానికి.. ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.


1: మీ PCలో WhatsApp యాప్‌ని తెరవండి.


2: మీరు WhatsApp స్టిక్కర్‌ని పంపాలనుకుంటున్న ఏదైనా చాట్‌కి వెళ్లండి.


3: దిగువ బార్‌లో అటాచ్‌మెంట్ ఎంపికపై క్లిక్ చేయాలి. మెనులోని స్టిక్కర్ ఎంపికపై క్లిక్ చేయండి.


4: ఫైల్ ఎక్స్‌ప్లోరర్ విండో నుంచి.. మీరు WhatsApp స్టిక్కర్‌గా ఉపయోగించాలనుకుంటున్న ఫోటోను క్లిక్ చేయండి.


5: ఫోటోను సర్దుబాటు చేయడానికి లేదంటే సందర్భానుసారంగా టెక్ట్స్ ను యాడ్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించండి.


6: ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక.. సెంట్ బటన్ పై క్లిక్ చేయండి.


ప్రస్తుతం కస్టమ్ వాట్సాప్ స్టిక్కర్లను సృష్టించే అవకాశం వెబ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది అనే విషయాన్ని వాట్సాప్ వెల్లడించడలేదు.


Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!


Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!