Google Fined: డామినెంట్‌ పొజిషన్‌ని దుర్వినియోగం చేస్తున్న అభియోగం మీద 1,337.76 కోట్ల జరిమానాను గూగుల్‌ (Google) ఎదుర్కొంటోంది. ఆండ్రాయిడ్ (Android) మొబైల్ డివైజ్‌లకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని కొన్ని మార్కెట్లలో దుర్వినియోగం చేసినందుకు కాపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) ఈ జరిమానా విధించింది. న్యాయబద్ధంగా లేని వ్యాపార పద్ధతులను తక్షణం నిలిపివేయాలని కూడా గూగుల్‌ను ఆదేశించింది. ప్రవర్తన మార్చుకోవడానికి ఆ కంపెనీకి కొంత సమయం ఇచ్చింది.


మన దేశంలో, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు గూగుల్‌ మీద 2019 ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల మీద వివరణాత్మక విచారణకు రెగ్యులేటర్ ఆదేశించింది. Android అంటే... స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలు (OEMలు) ఇన్‌స్టాల్ చేసిన ఓపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌.


ఆండ్రాయిడ్‌ OS OEMలు గూగుల్‌తో కుదుర్చుకునే మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (MADA), యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ (AFA) అనే ఒప్పందాలకు సంబంధించిన అన్యాయమైన పద్ధతులపై CCIకి ఫిర్యాదులు అందాయి.


ఇవీ CCI ఆదేశాలు..
ప్రి-ఇన్‌స్టలేషన్‌ కోసం గూగుల్‌కు చెందిన యాప్‌ల్లో నుంచి ఎంపిక చేసుకోకుండా OEMలను నియంత్రించకూడదని CCI ఆదేశించింది. యాప్‌లన్నింటినీ స్మార్ట్‌ ఫోన్లలో ఏకమొత్తంగా ప్రి-ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని బలవంతం చేయకూడదనీ చెప్పింది. ఫోన్లలో యాప్‌లను ఏ చోట అమర్చాలో ఓఈఎంలకు సూచించకూడదని తెలిపింది. ప్రి-ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను అన్‌- ఇన్‌స్టాల్‌ లేదా తొలగించకుండా కూడా వినియోగదారులను గూగుల్‌ నియంత్రించకూడదని తన ఆదేశాల్లో సీసీఐ పేర్కొంది. సీసీఐ ఆదేశాలపై గూగుల్‌ స్పందించ లేదు. ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్‌లో సీసీఐ దర్యాప్తును ప్రారంభించింది. సుమారు మూడేళ్లకు పైగా ఈ ప్రక్రియను జరిపిన అనంతరం గురువారం భారీ జరిమానా విధిస్తూ సీసీఐ ఆదేశాలిచ్చింది. వార్తల కంటెంట్‌, స్మార్ట్‌ టీవీ, గూగుల్‌ పే తదితరాలకు సంబంధించి పోటీవిరుద్ధ కార్యకలాపాలకు గూగుల్‌ పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపైనా సీసీఐ దర్యాప్తు జరుపుతోంది.


ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ యాప్స్‌ మాండేటరీ (తప్పనిసరి) ప్రి-ఇన్‌స్టలేషన్‌ కోసం MADAను అడ్డు పెట్టుకుని OEMలను నియంత్రించకూడదని గూగుల్‌కు CCI నిర్దేశించింది. యాప్‌లన్నింటినీ స్మార్ట్‌ ఫోన్లలో ఏకమొత్తంగా ప్రి-ఇన్‌స్టాల్‌ చేసుకోవడం, వాటిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేసే ఆప్షన్ లేకుండా చేయడం వంటివి పోటీ చట్టంలోని (Competition Law) సెక్షన్ 4(2)(d)కి విరుద్ధమని స్పష్టం చేసింది. ఫోన్లలో యాప్‌లను ఏ విధంగా అమర్చాలో OEMలకు గూగుల్‌ సూచించకూడదని కూడా CCI తేల్చి తెలిపింది. 


తాను మాత్రమే ఉండాలన్న పేరాశ
ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్ పేరాశకు పోతోంది. తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఆండ్రాయిడ్‌ OS OEMలతో ఒప్పందాలు కుదుర్చుకుని, పోటీ సంస్థలకు మార్కెట్‌లో స్థానం లేకుండా చేస్తోంది. యాప్‌ స్టోర్‌ మార్కెట్‌లోనూ ఇదే తరహా విధానాలను అవలంబిస్తోంది. పోటీ కంపెనీ వృద్ధి చెందకుండా తొక్కి పట్టడం పోటీ చట్టానికి విరుద్ధం.