Viral Video: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన వైద్యులు- బాధితుడు మృతి!

ABP Desam   |  Murali Krishna   |  21 Oct 2022 11:00 AM (IST)

Viral Video: డెంగ్యూతో బాధపడుతోన్న ఓ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఘటన కలకలం రేపుతోంది.

(Image Source: Twitter)

Viral Video: ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. డెంగ్యూతో బాధపడుతున్న ఓ రోగికి ప్లాస్మా పేరుతో బ్లడ్‌ బ్యాంక్‌ బత్తాయి జ్యూస్‌ను సరఫరా చేసింది. వైద్యులు కూడా రోగికి దీన్నే ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది

ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్‌ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు వైరల్ అవుతోన్న వీడియోలో తెలిపారు. డెంగ్యూతో బాధపడుతోన్న రోగికి ఇక్కడ బ్లడ్ ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్‌ను సరఫరా చేస్తున్నారని అందులో ఆరోపించారు. ఇదే జ్యూస్‌ను ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని వీడియోలో తెలిపారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్లడ్‌ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్‌ కనిపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేస్తున్నారనే వార్తలు రావడంతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేశ్ సింగ్ తెలిపారు.

రోగికి నకిలీ ప్లాస్మా సరఫరా చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. అయితే రోగి బంధువులు ఆరోపిస్తున్నట్లు అందులో ఉన్నది జ్యూస్ ఆ లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.                                                     -   రాకేశ్ సింగ్, ప్రయాగ్ రాజ్ ఐజీ

ప్రభుత్వం ఆగ్రహం

ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ స్పందించారు.

CMOతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి.. సంఘటనా స్థలానికి పంపాం. కొన్ని గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించాం. యూపీలో డెంగ్యూ రోగికి నకిలీ ప్లాస్మా సరఫరా చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటాం.                 -  డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్

Also Read: Diwali 2023 New York City: అమెరికాలోని ఆ నగరంలో దీపావళికి సెలవు, లోకల్ హాలిడేను తొలగించి మరీ నిర్ణయం

Published at: 21 Oct 2022 10:50 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.