జీ మెయిల్‌ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ స్పామ్ ఈమెయిల్స్‌ తెగ ఇబ్బంది పెడుతుంటాయి. ఇన్‌ బాక్స్‌ నిండా అవసరం లేని మెయిల్స్ వచ్చి చేరుతుంటాయి. వీటి కారణంగా ముఖ్యమైన మెయిల్స్ ను గుర్తించలేక ఇబ్బంది పడుతుంటారు వినియోగదారు. ఇవి ఒక్కోసారి చాలా ప్రమాదం కలిగిస్తాయి.  అందుకే వీటిని ఓపెన్ చేయకుండానే డిలీట్ చేయడం ఉత్తమం అని చెప్తారు టెక్ నిపుణులు. ఒక్కోసారి వీటిని ఓపెన్ చేస్తే సైబర్ నేరస్తులు మన మెయిల్ లోని ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, స్పామ్ మెయిల్స్ లెక్కకు మించి ఇన్ బాక్స్ లోకి చేరడంతో డిలీట్ చేయడం కూడ కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ సాయంతో స్పామ్ మెయిల్స్ కు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.  


స్పామ్ మెయిల్స్ కు ఇకపై చెక్


ఇకపై రోజుకు 5,000 కంటే ఎక్కువ మెసేజ్ లు పంపే బల్క్ ఇమెయిల్స్ ఇప్పుడు అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మెయిల్‌ను ఉపయోగించే వారికి సైబర్ ముప్పు తప్పే అవకాశం ఉంటుంది. మాండేటరీ అథెంటిఫికేషన్ ద్వారా  హానికరమైన ఈ మెయిల్స్ను 75 శాతం తగ్గించడంలో ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది. వినియోగదారులకు స్పామ్‌ను సులభంగా నివారించడంలో మరో కీలక మార్పు సహాయపడనున్నట్లు వెల్లడించింది. బల్క్ మెయిల్స్ పంపినవారు ప్రతి ఇమెయిల్‌తో 'అన్‌ సబ్‌స్క్రైబ్' బటన్‌ను చేర్చాల్సి ఉంటుంది. ఈ బటన్ సదరు స్పామ్ మెయిల్స్ ను కేవలం ఒక క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రైబ్ చేయడంలో సహాయపడుతుంది.  అంతేకాదు, ఈ మొత్తం అన్‌సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనంగా, Google ‘క్లియర్ స్పామ్ రేట్ థ్రెషోల్డ్’ని కూడా అందుబాటులోకి తెచ్చింది.  ఇది అనవసర సందేశాలను మరింత తగ్గించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించింది. తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ కారణంగా స్పామ్‌ మెయిల్స్ మరింత తగ్గుతాయని ఆశిస్తున్నట్లు Google పేర్కొంది.


గూగుల్ తో కలిసి పని చేస్తామన్న యాహూ


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? ఈ మార్పుల కోసం ఒత్తిడి చేస్తున్న వెబ్‌ మెయిల్ ప్రొవైడర్ Google మాత్రమే కాదు Yahoo కూడా ఉంది. ఈ రెండింటి వినియోగదారులు వారి ఇమెయిల్ ఇన్‌ బాక్స్‌ లను అస్తవ్యస్థం చేస్తున్న స్పామ్ మెయిల్స్ ను కంట్రోల్ చేయాలని గత కొంత కాలంగా కోరుతున్నారు. తాజాగా ఈ ఫీచర్లు గూగుల్ తో పాటు యాహూలోనూ అందుబాటులోకి  రానున్నట్లు తెలుస్తోంది. స్పామ్ మెయిల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యాహూ ప్రకటించింది.  కామన్ సెన్స్, హై ఇంఫాక్ట్ మార్పులను రూపొందించేందుకు Googleతో పాటు మిగతా ఈ మెయిల్ టీమ్స్ తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు Yahoo సీనియర్ ప్రొడక్ట్ డైరెక్టర్  మార్సెల్ బ్యాకర్ తెలిపారు.   


వాస్తవానికి  చాలా కాలంగా స్పామ్ ఒక ప్రధాన సమస్యగా మారింది. 2022లో పంపిన మొత్తం ఈమెయిల్స్లో 48.63 శాతం స్పామ్‌ మెయిల్స్ ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. సాఫ్ట్‌ వేర్,  సినిమా డౌన్‌లోడ్‌ల కోసం వెతుకుతున్న వ్యక్తుల ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించాయి. వీటిలో చాలా వరకు ఫిషింగ్ లింక్‌లు ఉన్నాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో Google స్పామ్ ప్రొటెక్షన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని టెక్ నిపుణులు కోరుకుంటున్నారు.


Read Also: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial