Chandrababu Arrest News : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో  అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు   రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది. ఈనేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను రెండు వారాల పాటు పొగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ వాడీవేడిగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున హాజరైన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ఘాటుగా తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు కస్టడీకి తగిన కారణాలు ఉన్నాయని పొన్నవోలు వాదించగా.. రాజకీయ కారణాలతోనే మరోసారి కస్టడీ అడుతున్నారని దూబే ఆరోపించారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రను నిర్ధారించేలా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. అలాగే చంద్రబాబు ఈ స్కాంకు కర్త, కర్మ, క్రియ అన్నారు. స్కిల్ స్కాంలో   రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయన్నారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీడీపీకి వచ్చిన ఆదాయ లెక్కల్ని ఆయన న్యయమూర్తికి సమర్పించారు. వీటిపై టీడీపీ కి చెందిన ఆడిటర్ ని పదో తేదీన ప్రశ్నిస్తామన్నారు. 


చంద్రబాబును రాజకీయ కక్షతోనే జైల్లో ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన లాయర్ ప్రమోద్ దూబే వాదించారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఒక్కరే తీసుకున్నట్లు చెప్పడం సరికాదన్నారు. అసలు స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదని, డిజైన్ టెక్ సంస్ధతో ఇతర సంస్ధలు ఒప్పందాలు చేసుకున్నాయని, చంద్రబాబు కేవలం సీఎంగా మాత్రమే సంతకాలు చేశారన్నారు. స్కిల్ కార్పోరేషన్ ద్వారా 2 లక్షల మందికి శిక్షణ లభించిందని, అంతా ఓపెన్ గానే జరిగిందని, ఇందులో స్కామ్ ఎక్కడుందని ప్రశ్నించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది?చంద్రబాబు పాత్ర ఏముంది?ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలి అని కోర్టును కోరారు.                             


మూడు రోజులుగా వాదనలు సాగుతున్నాయి. ఒక బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇంత సుదర్ఘంగా వాదనలు సాగుతూండటం న్యాయవర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.