Lightning Safety Tips: వర్షాకాలంలో ఉరుములు మెరుపుల హోరు సహజం. ఉరుముల సమయంలో టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపివేయమని చెబుతుంటారు. చాలామంది దీనిని ఒక పాత కాలపు అలవాటుగా కొట్టిపారేసి, కేవలం రిమోట్‌తో టీవీని ఆఫ్ చేసి, రౌటర్‌ను అలాగే ఉంచేస్తారు. కానీ, నేడు ఇళ్లల్లో ఖరీదైన స్మార్ట్ టీవీలు, హై-స్పీడ్ వై-ఫై రౌటర్లు, సెట్-టాప్ బాక్సులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ గాడ్జెట్‌లు చాలా సున్నితమైన ఎలక్ట్రానిక్ పార్ట్స్ ను కలిగి ఉంటాయి. ఒక చిన్న అజాగ్రత్త వేల రూపాయల నష్టాన్ని మిగుల్చుతుంది. అందుకే, ఉరుములు వచ్చే సమయంలో కేవలం స్విచ్ ఆఫ్ చేయడం సరికాదు, సాకెట్ నుండి ప్లగ్‌ను పూర్తిగా తీసివేయడం కూడా ముఖ్యమే.  

Continues below advertisement

కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదు?

చాలామంది స్విచ్ లేదా రిమోట్ ఉపయోగించి స్మార్ట్ టీవీని ఆఫ్ చేస్తే సేఫ్ అని భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. టీవీ లేదా వై-ఫై రౌటర్ సాకెట్‌కు ప్లగ్ చేసి ఉన్నంత సేపు, అవి మీ ఇంటి ఇంటర్నల్ వైరింగ్ ద్వారా బయటి మెయిన్ విద్యుత్ లైన్‌కు జాయింట్ అయి ఉంటాయి. భారీ వర్షం లేదా మెరుపుల సమయంలో, పవర్ గ్రిడ్‌లో అకస్మాత్తుగా అత్యధిక వోల్టేజ్ ప్రవాహం ఏర్పడవచ్చు. దీనినే 'పవర్ సర్జ్' అని పిలుస్తారు. ఈ హై వోల్టేజ్ కరెంట్, స్విచ్ ఆఫ్ చేసి ఉన్న స్విచ్‌ను కూడా ఛేదించుకుని, నేరుగా డివైజ్ ఇంటర్నల్ మదర్‌బోర్డ్‌లోకి దూసుకెళ్లగలదు. ఆధునిక స్మార్ట్ టీవీలు, రౌటర్లలో ఉండే సున్నితమైన చిప్‌లు ఇంతటి శక్తివంతమైన విద్యుత్ షాక్‌ను తట్టుకోలేవు. ఫలితంగా, సర్క్యూట్లు కాలిపోయి, పరికరం పూర్తిగా పనికిరాకుండా పోతుంది.

ఇంటర్నెట్ కేబుల్ ద్వారా కూడా 

వై-ఫై రౌటర్లు, స్మార్ట్ టీవీల విషయంలో ప్రమాదం కేవలం విద్యుత్ సరఫరాకు మాత్రమే పరిమితం కాదు. చాలా ఇళ్లల్లో, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం బయటి స్తంభాల నుండి వచ్చే కేబుల్, నేరుగా రౌటర్‌కు జాయిన్ చేసి ఉంటాయి. అలాగే, స్మార్ట్ టీవీలకు LAN కేబుల్స్ లేదా సెట్ టాప్ బాక్స్ వైర్లు కనెక్ట్ చేసి ఉంటాయి. ఒకవేళ సమీపంలో బలమైన పిడుగు పడితే, ఆ పిడుగు ఎలక్ట్రికల్ ఫీల్డ్ టెలికాం వైర్లపై కూడా ప్రభావం చూపగలదు.

Continues below advertisement

ఈ కేబుల్స్ ద్వారా కూడా హై వోల్టేజ్ కరెంట్ నేరుగా మీ రౌటర్‌లోకి వచ్చి, దానిని దెబ్బతీస్తుంది. రౌటర్ ద్వారా ఆ షాక్ టీవీ లేదా కంప్యూటర్‌కు కూడా పాకే ప్రమాదం ఉంది. అందుకే, వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు, పవర్ ప్లగ్‌ను తీసివేయడంతో పాటు, రౌటర్ నుండి ఇంటర్నెట్ కేబుల్‌ను, టీవీ నుండి యాంటెన్నా లేదా సెట్-టాప్ బాక్స్ వైర్‌ను కూడా డిస్‌కనెక్ట్ చేయడం సేఫ్.    Also Read: 180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  1. మీ ప్రాంతంలో భారీ ఉరుములతో కూడిన తుపాను సంభవిస్తున్నట్లు తెలిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి. 
  2. మీ స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్, కంప్యూటర్ వంటి ఖరీదైన పరికరాలను సాకెట్ల నుండి పూర్తిగా తొలగించండి. 
  3. ప్లగ్ తీసేటప్పుడు మీ చేతులు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. రబ్బరు చెప్పులు ధరించడం మంచిది.

ఇంటి మెయిన్ విద్యుత్ సరఫరాకు లేదా వ్యక్తిగత పరికరాల కోసం సర్జ్ ప్రొటెక్టర్  లేదా వోల్టేజ్ స్టెబిలైజర్‌ ను అమర్చుకోవడం ద్వారా కొంత రక్షణ లభిస్తుంది. ఇవి అకస్మాత్తుగా పెరిగే వోల్టేజ్‌ను నిరోధిస్తాయి. అయినప్పటికీ, పిడుగుపాటు సమయంలో పరికరాలను అన్‌ప్లగ్ చేయడమే పూర్తి సురక్షిత మార్గం.  చిన్న అప్రమత్తత ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను భారీ నష్టం నుండి కాపాడుతుంది.

Also Read: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!