నేడు స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. రోజంతా వాడినా, లేక ఎక్కువ గంటలు వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా బ్యాటరీ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పవర్ బ్యాంక్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఛార్జింగ్ సౌకర్యం లేని ఏరియాలకు వెళ్ళినప్పుడు మీకు పవర్ బ్యాంక్ అవసరం. పవర్ బ్యాంక్ కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు వైర్ ఉన్నది తీసుకోవాలా, లేక కొత్తగా వచ్చిన వైర్లెస్ పవర్ బ్యాంక్ కొనాలా అని ఆలోచన మొదలవుతుంది.
ఒకవైపు వైర్లెస్ పవర్ బ్యాంక్ చూడటానికి బాగుండి, వాడేందుకు ఈజీగా అనిపిస్తుంది. మరోవైపు ఇన్నేళ్లుగా వాడుతున్న వైర్ పవర్ బ్యాంక్ (Wired Power Bank) మీకు ఛార్జింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ఇస్తుంది. రెండింటికీ వాటికంటూ కొన్ని ప్లస్, మైనస్ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మీకు ఏది సరైనదో ఈ విషయాలను తెలుసుకోండి.
ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ హెల్త్‌లో ఏది బెస్ట్
ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, ఇక్కడ వైర్ పవర్ బ్యాంక్ బెస్ట్ అనిపిస్తుంది. కేబుల్ ద్వారా ఫోన్‌ను పవర్ బ్యాంక్‌కు కనెక్ట్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం నేరుగా, ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. కొత్తగా వస్తున్న వైర్డ్ పవర్ బ్యాంక్‌లు 22.5W నుంచి 65W లేదా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తున్నాయి. దాంతో అరగంటలోనే మీ ఫోన్ చాలా వరకు ఛార్జ్ అవుతుంది.
వైర్లెస్ పవర్ బ్యాంక్‌లో ఇండక్షన్ కాయిల్ ఉపయోగిస్తారు. ఇందులో గాలి ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ప్రక్రియలో చాలా శక్తి వేడి రూపంలో పోతుంది. దాంతో ఛార్జింగ్ నెమ్మదిగా జరుగుతుంది. ఇందులో ఎక్కువ వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల ఫోన్ బ్యాటరీపై ప్రతికూలా ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. మీరు తక్కువ సమయంలో త్వరగా ఫోన్ ఛార్జ్ చేసుకోవాలన్నా, బ్యాటరీ వేడెక్కకుండా ఉండాలన్నా వైర్డ్ పవర్ బ్యాంక్ సరైనది.
ఉపయోగించడంలో ఏది బెస్ట్
వైర్లెస్ పవర్ బ్యాంక్‌లో దీనిని వేలాడదీసుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా MagSafe లేదా మాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్‌లు ఫోన్ వెనుక భాగంలో అతుక్కుపోతాయి. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా జేబులో ఫోన్ పెట్టుకుని ఛార్జ్ చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇందులో చిన్న సమస్య ఏంటంటే, ఫోన్ కవర్ మరీ మందంగా ఉంటే ఛార్జింగ్ సరిగ్గా అవ్వదు. వైర్ ఉన్న పవర్ బ్యాంక్‌తో మీరు ఒక ఛార్జింగ్ కేబుల్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కొన్నిసార్లు జేబులో లేదా బ్యాగ్‌లో చిక్కుకుంటుంది. ఒకవేళ కేబుల్ మర్చిపోయినా లేదా పాడైపోయినా, వైర్ ఉన్న పవర్ బ్యాంక్ పనికిరాకుండా పోతుంది.
ధర, కంపాటిబిలిటీలో ఏది ఉత్తమం
బడ్జెట్, డివైజ్ కంపాటిబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. వైర్ ఉన్న పవర్ బ్యాంక్ ప్రపంచంలోని దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను సులభంగా ఛార్జింగ్ చేస్తుంది. ఫోన్ చౌకదైనా లేదా ఖరీదైనదైనా సరే. ధర విషయంలో కూడా వైర్డ్ పవర్ బ్యాంక్‌లు చాలా ఉంటాయి. 1000 రూపాయల నుంచి 1500 లకు 10000mAh లేదా 20000mAh సామర్థ్యం గల పవర్ బ్యాంక్ లభిస్తాయి.
వైర్లెస్ పవర్ బ్యాంక్‌లు వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఎంపిక చేసిన, ఖరీదైన స్మార్ట్ఫోన్లతో మాత్రమే పనిచేస్తాయి. వీటి ధర కూడా సాధారణ పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ. పవర్ లాస్ అవ్వడం వల్ల ఇవి ఫోన్‌ను అన్నిసార్లు ఫుల్ ఛార్జ్ చేయలేవు. మీ బడ్జెట్ తక్కువగా ఉండి, మీరు వేగంగా ఛార్జింగ్ కోరుకుంటే మాత్రం వైర్ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోండి. ఖరీదైన ఫోన్ అయి, కేబుల్స్ వేలాడదీసుకుని ఉంచడం వద్దనుకుంటే వైర్లెస్ పవర్ బ్యాంక్ తీసుకోండి.
