ఫేస్‌బుక్‌లో వెరిఫైడ్ అకౌంట్ కావాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో వెరిఫైడ్ అకౌంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. అంటే మీరు మీ ఖాతాను వెరిఫైడ్ అకౌంట్‌గా బ్లూటిక్‌తో చూసుకోవాలనుకుంటే ఈ సదుపాయాన్ని తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రతి నెలా రూ.699 సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ మొబైల్ యాప్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వెబ్ వెర్షన్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.


వెబ్ వెర్షన్‌లో తక్కువ ఛార్జీలు
వెబ్ వెర్షన్ ప్రారంభమైనప్పుడు వినియోగదారులకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 599 అందించబడుతుంది. భారతదేశంలోని వినియోగదారులు ప్రస్తుతం iOS, ఆండ్రాయిడ్‌లలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 699 తీసుకోవచ్చని మెటా తెలిపింది. ఫేస్‌బుక్ వెరిఫైడ్ అకౌంట్ సబ్‌స్క్రిప్షన్ కోసం, Facebook, Instagram వినియోగదారులు ప్రభుత్వ ఐడీతో తమ ఖాతాను వెరిఫై చేయాల్సి ఉంటుంది.


వెరిఫైడ్ అకౌంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత
వెరిఫై చేసిన ఖాతాకు భద్రత, మద్దతు లభిస్తుందని కంపెనీ తెలిపింది. "ప్రపంచంలోని అనేక దేశాలలో మా ప్రారంభ పరీక్షల నుంచి అద్భుతమైన ఫలితాలను చూసిన తర్వాత మేం మెటా వెరిఫైడ్ సర్వీస్ టెస్టింగ్‌ను భారతదేశానికి విస్తరిస్తున్నాం." అని మెటా తెలిపింది.


ఇప్పటికే ఉన్న ప్రమాణాల ఆధారంగా గతంలో అందించిన వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను గౌరవించడం కూడా కొనసాగిస్తాం. ఫేస్‌బుక్ వెరిఫైడ్ అకౌంట్ పొందాలంటే కొన్ని షరతులు ఉండాలి. వినియోగదారులు తప్పనిసరిగా కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.


ఫేస్‌బుక్ వెరిఫైడ్ అకౌంట్ సర్వీసు కోసం మీరు సమర్పించే ప్రభుత్వ ఐడీ... ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రొఫైల్ పేరు, ఫోటోతో సరిపోయేలా వినియోగదారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రియేటర్స్ తమ ఉనికిని నమోదు చేసుకోవడం సులభతరం చేయాలనుకుంటున్నామని, తద్వారా వారు Instagram లేదా Facebookలో తమ కమ్యూనిటీని నిర్మించుకోవడంపై దృష్టి పెట్టగలరని కంపెనీ తెలిపింది. అలాంటి ఖాతాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదని మెటా తెలిపింది. ఇది మాత్రమే కాదు ఇంతకు ముందు ధృవీకరించబడిన ఖాతాలలో ఎటువంటి మార్పు ఉండదు.


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల పేరెంట్ కంపెనీ మెటా ఇటీవలే కొత్తగా 3డీ అవతార్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్‌లకు ఈ 3డీ అవతార్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫీడ్ పోస్టులు, స్టోరీలు, ప్రొఫైల్ పిక్చర్లుగా వీటిని ఉంచుకోవచ్చు. దీంతోపాటు కంపెనీ తన ప్లాట్‌ఫాంలకు అప్‌డేట్స్ కూడా అందించింది.


మరిన్ని హావభావాలు, ఫేసెస్, స్కిన్ టోన్లతో మెటా అవతార్లను కంపెనీ అప్‌డేట్ చేసింది. దీంతోపాటు కంపెనీ డిజిటల్ క్లోతింగ్‌తో కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఇందులో ఎన్ఎఫ్ఎల్ టీ షర్టులు కూడా ఉన్నాయి. సూపర్ బౌల్ కోసం వాటిని వేసుకోవచ్చు. క్వెస్ట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.


అయితే ప్రస్తుతానికి ఇది అమెరికా, మెక్సికో, కెనడాల్లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ 3డీ అవతార్‌లను స్టోరీలు, డీఎంల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అవతార్‌ల్లో వేర్వేరు ఫేషియల్ షేపులు, ఎక్స్‌టెన్సివ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకమైన ఫీచర్లను ఇందులో అందించారు.


ఈ కొత్త అవతార్‌లు ప్రస్తుతం ఫేస్‌బుక్, మెసెంజర్‌ల్లో రోల్ అవుట్ అవుతున్నాయి. వినియోగదారులు అన్నిట్లో ఒకే అవతార్‌ను వాడుకోవచ్చు. లేదా ప్లాట్‌ఫాంను బట్టి వేర్వేరు అవతార్‌లను మార్చుకోవచ్చు. మెటావర్స్‌పై తమ దీర్ఘకాలిక ప్రణాళికలను తెలిపినప్పటి నుంచి, తాము సోషల్ టెక్నాలజీని తర్వాతి స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామని అవతార్స్ అండ్ ఐడెంటిటీ జనరల్ మేనేజర్ అయిగెరిమ్ షోర్మెన్ తెలిపారు.


Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?