Payyavula Kesav :  సీఎం జగన్‌మోహన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని దెబ్బతీస్తోందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్  పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఏపీలో వరుసగా పెరుగుతున్న విద్యుత్ చార్జీలు ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమేనన్నారు.  గురువారం మడిాయతో మాట్లాడిన ఆయన 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో ఒక్కో కుటుంబం ఎంత విద్యుత్ ఛార్జీలు చెల్లించింది.. ఈ 4 ఏళ్లనుంచి ఎంత చెల్లిస్తోందో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ప్రజలపై రూ.57వేలకోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటానికి ప్రధాన కారణం జగన్ సర్కారు అవినీతి నిర్ణయాలని విమర్శించారు. కమీషన్ల కోసం బయట మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనడం, నాసిరకం బొగ్గుకొనుగోళ్లు, కేంద్రవిద్యుత్ సంస్థలనుంచి కొనుగోళ్లు నిలిపేయడం, వ్యవసాయమోటార్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం లాంటి కారణాలతో ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. 


ఇప్పటికి 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్.. సంక్షేమం పేరుతో ఇచ్చేదానికంటే అదనంగా విద్యుత్ ఛార్జీలపేరుతో దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.   “ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్ ఛార్జీలంటూ రకరకాల పేర్లతో నేరుగా యూనిట్ ధరలు పెంచకుండా సామాన్యుల్ని దోచుకుంటున్నారు. జగన్ పాలనలో సామాన్య , పేద, మధ్యతరగతి వర్గాల విద్యుత్ వాడకం పెరగలేదు. కానీ విద్యుత్ ఛార్జీల భారం మాత్రం ఎక్కువైంది.  తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా దాన్ని కాదని ప్రభుత్వం అధిక ధరకు తమకు అనుకూలంగా ఉండేవారి నుంచి కొంటోంది. హిందుజా సంస్థ నుంచి ఈ ప్రభుత్వం ఒక్క యూనిట్ విద్యుత్ కొనకపోయినా, ఒప్పందం ప్రకారం ఆ సంస్థకు అప్పనంగా రూ.2,200 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. ఈ చెల్లింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అవకాశమున్నా కూడా ప్రభుత్వం డబ్బు చెల్లించడానికే సిద్ధపడిందని మండిపడ్డారు. 


కేవలం తమకు వస్తున్న కమీషన్ల కోసమే ప్రభుత్వం హిందుజా సంస్థకు  ఊరికే దోచిపెడుతోంది. అలానే ఇండోస్ సోలార్ సంస్థ విషయంలో కూడా ప్రవర్తిస్తున్నారు. ఒక యూనిట్ విద్యుత్ కొంటూ, రెండు యూనిట్లకు డబ్బు చెల్లిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మీటర్ల పేరుతో విద్యుత్ వినియోగదారులు అదనంగా దోపిడికీ గురికాబోతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం పెంచని విధంగా ఏపీ మాత్రమే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. 


2014లో ఏపీ 22వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటులో ఉంటే... 2019 నాటికి చంద్రబాబు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారన్నారు. 4 ఏళ్లలో జగన్ ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా పెంచారా అని ప్రశ్నించారు. 8 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ అదానీ సంస్థకు కట్టబెట్టిన దానిలో అవినీతికి తెరలేపారన్నారు. హైకోర్టు జోక్యంతో ప్రజలపై రూ.లక్షకోట్ల వరకు భారం పడకుండా నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజలు సమర్థిస్తున్నారు అనడం పచ్చి అబద్ధమన్నారు. జీవో-1తో ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని అధికారంతో అణచివేసే చర్యలకు ఎందుకు పాల్పడుతోందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలస్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను గౌరవించింది కాబట్టే వారు నిరసన వ్యక్తం చేయగలిగారని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల నుంచి పెల్లుబికే నిరసన ధాటికి ప్రభుత్వం ఎక్కడుంటుందో కూడా చెప్పలేమని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.