ఈమెయిల్ ఆవిష్కర్తను తానే అంటూ చెప్పుకునే శివ అయ్యాదురై ట్విట్టర్ సీఈవోగా మారేందుకు ఆసక్తి కనబరిచారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుండి వైదొలిగే ఆలోచనలో ఉన్నానని ఎలాన్ మస్క్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.


ట్విట్టర్‌లో అయ్యాదురై “డియర్ ఎలాన్ మస్క్, నాకు Twitter CEO పదవిపై ఆసక్తి ఉంది. నేను MIT నుండి నాలుగు డిగ్రీలను సాధించాను. ఏడు విజయవంతమైన హైటెక్ సాఫ్ట్‌వేర్ కంపెనీలను సృష్టించాను. దరఖాస్తు చేసే ప్రక్రియ గురించి దయచేసి సలహా ఇవ్వండి.” అని ట్వీట్ చేశారు.






ప్రభుత్వ బ్యాక్‌డోర్ పోర్టల్ గురించి మాట్లాడుతూ అయ్యాదురై ఇది 'చట్టానికి అతీతమైనది'అన్నారు. దాని గురించి ట్వీట్ కూడా చేశారు. "ఎలాన్ మస్క్... ట్విట్టర్‌లో ప్రభుత్వ బ్యాక్‌డోర్ పోర్టల్ ఉనికిలో ఉందని మీకు ఇప్పటికే తెలుసు. ఇది "చట్టానికి అతీతమైనది". చరిత్రాత్మక 2020 లా సూట్‌లో నేను ఎక్స్‌పోజ్ చేసిన పోర్టల్‌ను నువ్వు ఎప్పుడు నాశనం చేస్తావు?" అని ప్రశ్నించారు.






1978లో అయ్యాదురై ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని సృష్టించాడు. దానిని అతను "ఈమెయిల్" అని పిలిచాడు. ఈ ప్రోగ్రామ్ ఇంటర్‌ఆఫీస్ మెయిల్ సిస్టంలో ఉన్న ఇన్‌బాక్స్, అవుట్‌బాక్స్, ఫోల్డర్‌లు, మెమో, అటాచ్‌మెంట్‌లు, అడ్రస్ బుక్ ఫార్మాట్‌లను రెప్లికేట్ చేసింది. 


2011లో ఈయన తనను తాను ప్రస్తుతం అందరూ ఉపయోగిస్తున్న ఈమెయిల్ సృష్టికర్తగా ప్రకటించుకున్నాడు. అయితే ఆ తర్వాత దానిపై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. అయ్యాదురై కంటే ముందే ఈమెయిల్ ఫీచర్లను తాము అందించామని ARPANET అనే రీసెర్చ్ కమ్యూనిటీ ఆరోపించింది. ఫైనల్‌గా ARPANET కంపెనీకి చెందిన రే టామిల్సన్ 1971లో ఈమెయిల్ ప్రోగ్రాం చేసినట్లు నిర్ణయించారు.


ఆ తర్వాత అయ్యాదురై చదివిన ఎంఐటీ (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కూడా అతని కంపెనీ ‘ఈమెయిల్ ల్యాబ్’తో తన సంబంధాలను తెంచుకుంది. బయో ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయ్యాదురై లెక్చర్ కాంట్రాక్ట్‌ను కూడా నిలిపివేసింది


అయ్యాదురై బొంబాయిలోని ఒక తమిళ కుటుంబంలో జన్మించాడు. అతను ఏడేళ్ల వయసులో USకు వెళ్లాడు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుండి వైదొలుగుతానని, అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని కీలక విభాగాలను కొనసాగిస్తానని చెప్పారు. "నా పదవిని చేపట్టే మూర్ఖుడు దొరికిన వెంటనే నేను CEO పదవికి రాజీనామా చేస్తాను! ఆ తర్వాత, నేను సాఫ్ట్‌వేర్ & సర్వర్‌ల బృందాలను నడుపుతాను" అని మస్క్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.