BSNL: జియో, ఎయిర్‌టెల్, వీఐ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ చాలా షార్ప్‌గా మారిపోయింది. బీఎస్ఎన్ఎల్ ఈ సమయాన్ని తనకు ఒక ప్రత్యేక అవకాశంగా భావిస్తోంది. దేశవ్యాప్తంగా తన సేవలను మెరుగుపరచడంలో నిమగ్నమై ఉంది. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 15 వేల కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేసింది.


భారతదేశ ప్రభుత్వానికి చెందిన ఈ టెలికాం సంస్థ తక్కువ ఖర్చుతో ప్రజలకు సూపర్‌ఫాస్ట్ కనెక్టివిటీని అందించడానికి దేశవ్యాప్తంగా 4జీ టవర్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ భారతదేశంలోని 15 వేలకు పైగా మొబైల్ సైట్లలో 4జీ టవర్లను అమర్చింది. బీఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. దీనిలో వారు ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కింద దేశంలో 15000 కొత్త 4జీ సైట్‌లను నిర్మించినట్లు తెలిపింది.


ఇది మాత్రమే కాదు బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు 5జీ సేవని కూడా పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రియాశీల చర్యల ద్వారా బీఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. జూలై నెలలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 20 నుంచి 25 శాతం వరకు పెంచాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీని కారణంగా వినియోగదారులు చాలా నిరాశ చెందారు. ఎందుకంటే వారి రీఛార్జ్ ఖర్చు చాలా పెరిగింది.






Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఛాన్స్ పట్టేసుకున్న బీఎస్ఎన్ఎల్...
ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను పెంచి చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందజేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ప్రభావవంతంగా ఉందని నిరూపించబడింది. కేవలం ఒక నెలలోనే లక్షల మంది కొత్త కస్టమర్‌లు బీఎన్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చేరారు. భారతీయ టెలికాం కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులవుతున్న తీరును గుర్తించిన ప్రభుత్వ టెలికాం సంస్థ దేశవ్యాప్తంగా తన సేవలను మెరుగుపరిచే ప్రక్రియను వేగవంతం చేసింది. మరింత మంది కొత్త కస్టమర్లను తనకు చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. 


ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ కూడా దేశంలో తన 5జీ సేవను తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. అదే సమయంలో 4జీ సేవను కూడా చాలా వేగంగా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి మేడ్ ఇన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలని ప్రధాని మోదీ సూచించారని భారత టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల వెల్లడించారు. దీంతో బీఎస్ఎన్ఎల్ 5జీ త్వరలో రానుందన్న విషయం మాత్రం ఫిక్స్ అయిపోయింది. అయితే అది ఎప్పటికి వస్తుందో చూడాలి.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?