MP Kalishetti Appalanaidu Special Attraction In The Parliament: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత వస్ర్తాలను ధరించి పార్లమెంట్‌కు హాజరైన ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. చేనేత వస్ర్తాలను ధరించడంతోపాటు తెలుగుదనం ఉట్టిపడేలా పంచె, లాల్చీ, కండువా ధరించిన ఆయన సైకిల్‌పై పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంట్‌ హాలుకు దగ్గరలోని ఆంధ్ర భవన్‌లో గల హ్యాండ్లూమ్‌ షాప్‌లో బుధవారం ఉదయమే వెళ్లిన ఎంపీ పంచె, లాల్చీ, కండవా కొనుగోలు చేశారు.


ఈ సందర్భంగా అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ చేనేత కుటుంబాలను ప్రోత్సహించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని, పార్లమెంట్‌లో ఉన్నా, బయట ఉన్నా ప్రతి శుక్రవారం చేనేత వస్ర్తాలను ఇకపై ధరిస్తానని ప్రకటించారు. భారతదేశం సుసంపన్న వారసత్వానికి చేనేత పరిశ్రమ చిహ్నంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి వ్యవసాయ రంగంతోపాటు ముఖ్యమైన వనరులల్లో చేనేత రంగం ఒకటన్నారు. చేనేత రంగాన్ని కాడపుకోవాల్సిన బాధ్యత భారత పౌరుడిగా ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మహిళా సాధికారిత గురించి నేరుగా ప్రస్తావించే రంగం చేనేత అని వెల్లడించారు. 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వంలో అప్పటి దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆరంభించిన నాటి నుంచి జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. 


చేనేత కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలి


వ్యవసాయ రంగం కోసం పాటుపడుతున్న రైతు కుటుంబాలకు అందిస్తున్న మాదిరిగానే చేనేత రంగం కోసం పాటుపడుతున్న వారికి కూడా సమానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటిల్లిపాది వ్యవసాయం కోసం పాటుపడినట్టుగానే చేనేత కోసం చేనేత కుటుంబాలు పాటు పడతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ ప్రాధాన్యత తీసుకుని మరింత అధ్యయనం చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహించి ఆదుకోవాలని కోరారు. చేనేత కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 


మోదీ చిత్రంతో కూడిన చేనేత వస్త్రం అందజేత


జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని చిత్రంతో కూడిన చేనేత వస్ర్తాన్ని మోదీకి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులైన చేనేత కార్మికులు ఈ వస్ర్తాన్ని తీర్చిదిద్దారు. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానికి అభినందనలు అన్న అక్షరాలతోపాటు తెల్లని జుట్టు, గడ్డం, తెల్లని వస్ర్తాలు, ఎర్రని రంగులోని కండువాతో కూడిన చిత్రాన్ని(చేనేత వస్త్రంపై) ప్రధానికి అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ వస్ర్తాన్ని తీర్చిదిద్దిన తీరును అడిగి తెలుసుకున్నారు. చేనేత దినోత్సవం రోజు చేనేత వస్త్రంపై చిత్రంతో కూడినది అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.