టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్టుకు చాలా క్రేజ్ ఉంటుంది. ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఐఫోన్ వాడాలని మొబైల్ ప్రియులు ఆశపడుతారు. అయితే, ప్రస్తుతం ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునేవారు మరికొద్ది రోజులు ఆగితే మంచిదని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆగస్టు ఎండింగ్ వరకు కొత్త ఐఫోన్ కొనుగోలు అనే అంశాన్ని వాయిదా వేసుకోవడం మంచిది అంటున్నారు.


ఆగస్టులో ఐఫోన్లు ఎందుకు కొనకూడదు అంటే?


ఆపిల్ కంపెనీ ప్రతి ఏటా సెప్టెంబర్ లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే సరికొత్త ఐఫోన్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొత్త ఫోన్లు మార్కెట్లోకి రావడంతో పాత ఫోన్ల ధరలు కొంతమేర తగ్గుతాయి. అందుకే ఆగష్టులో ఐఫోన్లు కొనడం కారణంగా ఎక్కువ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జులై,  ఆగస్టులో ఐఫోన్‌ను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు.


కొత్త మోడళ్లను వెంటనే కొనకపోవడం మంచిది


సెప్టెంబర్ లో ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. అయితే, కొత్త ఐఫోన్‌ విడుదలైన వెంటనే కొనుగోలు చేయకపోవడం మంచిదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు కొత్త ఫోన్లలో  సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే లాంచ్ తర్వాత ఒకటి లేదంటే రెండు నెలలు వేచి ఉండటం మంచింది. ఈ సమయంలో కొత్త ఐఫోన్‌లతో ఏవైనా ప్రారంభ సమస్యలను గుర్తించి ఉంటే వాటిని కంపెనీ పరిష్కరిస్తుంది. ఆ తర్వాత ఐఫోన్ ను కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్యలు లేకుండా బేషుగ్గా వాడుకోవచ్చు. ఇక ఐఫోన్ తక్కువ ధరకు కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లు, కొత్త ఐఫోన్‌ను విడుదల చేసిన తొమ్మిది వరకు కొనుగోలు చేయడం మంచిది అంటున్నారు.  జూలై లేదంటే అక్టోబర్‌లో అమెజాన్ ప్రైమ్ డే ,  బ్లాక్ ఫ్రైడే వంటి షాపింగ్ ఈవెంట్లలో ఐఫోన్ ను అనేక ఆఫర్లతో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేల్స్ సమయంలో తాజా ఐఫోన్ మోడల్స్ సైతం కాస్త తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది. కొంచెం పాత మోడళ్లను ఎంచుకోవడానికి ఇష్టపడే వారికి, ప్రైమ్ డే,  బ్లాక్ ఫ్రైడే సందర్భంగా మంచి డీల్స్ అందుబాటులో ఉంటాయి.    


వచ్చే నెలలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు విడుదల


ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐ ఫోన్ 15 సిరీస్ ఫ్రో మోడల్స్ ను కొత్త రంగుల్లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో ప్రీమియం టైటానియం మెటీరియల్ వాడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా  వీటి బరువు గత ఫోన్ల కంటే తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial