iPhone 16 SE: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు రీడిజైన్ చేసిన కెమెరా లేఅవుట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఒక టిప్‌స్టర్ తెలిపారు. కెమెరా లేఅవుట్‌కు సంబంధించిన పిక్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఐఫోన్ 12 తర్వాత వర్టికల్ కెమెరా లేఅవుట్‌తో లాంచ్ కానున్న మొదటి సిరీస్ ఇదే అయ్యే అవకాశం ఉంది. ఎప్పటిలాగా నాలుగు మోడల్స్ కాకుండా ఈసారి ఐదు మోడల్స్‌లో ఐఫోన్ 16 రానుందని సమాచారం.
6.7 అంగుళాల సైజు ఉండే ‘ప్లస్ ఎస్ఈ’ మోడల్‌ను ఈ సిరీస్‌లో యాపిల్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఎక్స్/ట్విట్టర్‌లో ఒక యూజర్ దీనికి సంబంధించిన వివరాలను టీజ్ చేశారు. వర్టికల్ కెమెరా లే అవుట్‌తో ఐఫోన్ 16 సిరీస్ రానుందని పేర్కొన్నారు.
ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16 ఎస్ఈ, ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్క కూడా మారనుంది.
ఐఫోన్ ఎస్ఈ మోడల్స్‌లో సాధారణంగా ఒక కెమెరానే ఉంటుంది. కాబట్టి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ డిజైన్‌ల్లో ఒక కెమెరానే వెనకవైపు చూడవచ్చు. ఐఫోన్ 16లో మాత్రం వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల్లో వెనకవైపు మూడేసి కెమెరాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం లీకులు మాత్రమే కాబట్టి వీటిలో నిజం ఎంతుందో తెలియాలంటే మాత్రం ఐఫోన్ 16 సిరీస్ వచ్చే దాకా ఆగాల్సిందే.
ఐఫోన్ 16 సిరీస్‌లో కంపెనీ కేవలం కెమెరాల విషయంలోనే కాకుండా ఇంకా మరిన్ని మార్పులు కూడా చేయనుందని సమాచారం. ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో అందించిన యాక్షన్ బటన్‌నే ఈసారి ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని ఫోన్లలో అందించనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే కెమెరాకు క్విక్ యాక్సెస్ కోసం ప్రత్యేకమైన క్యాప్చర్ బటన్ ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌కు ఇంకా ఏడు నెలల వరకు సమయం ఉంది. ఈ రూమర్లన్నీ నిజాలో కాదో తెలియాలంటే అప్పటి దాకా ఆగాల్సిందే. అయితే ఈ గ్యాప్‌లో మరిన్ని లీకులు, రూమర్లు కూడా రావడం గ్యారంటీ.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?