Apple Siri Issue: టెక్ కంపెనీ యాపిల్ తనపై వేసిన దావాను సెటిల్ చేసుకునేందుకు అంగీకరించింది. ఇందుకోసం 95 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.815 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ సిద్ధమైంది. దీని వల్ల వేలాది మంది వినియోగదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1,700 జమ అవుతుంది. యాపిల్ తన వాయిస్ అసిస్టెంట్ సిరి వినియోగదారుల సంభాషణలను చట్టవిరుద్ధంగా విని వాటిని యాడ్స్ కోసం థర్డ్ పార్టీలకు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను యాపిల్ తోసిపుచ్చింది. 


2021లో యాపిల్‌పై దావా...
ఈ వ్యాజ్యం యాపిల్‌కు వ్యతిరేకంగా 2021 సెప్టెంబర్‌లో దాఖలు అయింది. ఇది మొదట 2021 ఫిబ్రవరిలో దాఖలు అయినప్పటికీ తగిన సాక్ష్యాధారాలు లేనందున ఆ వ్యాజ్యాన్ని కొట్టిపడేశారు. ఆ తర్వాత కొత్త వ్యాజ్యం దాఖలైంది. అనుకోకుండా వర్చువల్ అసిస్టెంట్ సిరిని యాక్టివేట్ చేసినా యాపిల్ తమ సంభాషణలను రికార్డ్ చేస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. ఓ యూజర్ సర్జరీ గురించి డాక్టర్‌తో మాట్లాడుతున్నారని, అనంతరం అదే అంశానికి సంబంధించిన పలు యాడ్స్ వచ్చాయని ఆరోపించారు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


ఈ ఆరోపణలను ఖండిస్తున్న యాపిల్...
2021లో దావా వేసినప్పటి నుంచి యాపిల్ తనపై వచ్చిన ఆరోపణలను ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే ఉంది. కానీ నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఎటువంటి డేటా లేదా సమాచారాన్ని అందించలేదు.


రూ.815 కోట్లతో పరిష్కరించుకోనున్న యాపిల్...
మూడు సంవత్సరాల తర్వాత యాపిల్ ఇప్పుడు కేసును పరిష్కరించడానికి అంగీకరించింది. బాధిత వినియోగదారులకు కంపెనీ ఇప్పుడు రూ.815 కోట్లు చెల్లించనుంది. ఇది ప్రతి బాధిత యూజర్‌కు (2014 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు రికార్డు చేసిన యూజర్లు) రూ.1,700 ఇస్తుంది. యాపిల్ ఇప్పటికీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. దీన్ని సెటిల్ చేసుకోవడానికి మాత్రమే పరిష్కారానికి అంగీకరించింది. మరోవైపు యాపిల్ 2024 సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయడానికి యాపిల్ రెడీ అవుతోంది. 2025 సెప్టెంబర్‌లో ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?