Jasprit Bumrah News: భారతస్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై అప్డేట్ వచ్చింది. అతనికి వెన్ను నొప్పి ఉండటంతోనే ఐదో టెస్టు రెండోరోజు మధ్యలోనే మ్యాచ్ నుంచి బయటకు వెళ్లిపోయాడని తెలిసింది. అయితే ఇప్పటికే స్కాన్ డిటైల్స్ రాగా, ప్రస్తుతానికి అంతా బాగుందనే రిపోర్టు వచ్చిందని భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ మీడియా సమావేశంలో తెలిపాడు. ప్రస్తుతం తమకు పూర్తి వివరాలు తెలియవని, మెడికల్ టీమ్ నుంచి అప్డేట్ కోసం వేచి చూస్తున్నామని వెల్లడించాడు. మొత్తానికైతే బుమ్రా వెన్ను గాయంతో ఆస్పత్రికి వెళ్లాడని తేటతెల్లమైంది.
బ్యాటింగ్ కు ఓకే.. బౌలింగే..
అయితే వెన్ను నొప్పి కారణంగా ప్రస్తుతానికి బుమ్రా బ్యాటింగ్ చేయవచ్చని, బౌలింగ్ గురించి ఆదివారం ఉదయం స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికైతే బుమ్రాకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రసిధ్ తెలిపాడు. ఆదివారం ఉదయం, పరిస్థితులను బట్టి, అలాగే బుమ్రా ఆరోగ్య పరిస్థితులను బట్టి బౌలింగ్ పై నిర్ణయం తీసుకుంటామాని వెల్లడించాడు. ఇక బుమ్రా ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు లంచ్ అనంతరం ఒక ఓవర్ వేసిన తర్వాత వెన్ను నొప్పి రావడంతో ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి బయలు దేరాడు. తాజాగా అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సిరీస్ లో అద్బుతంగా రాణిస్తున్న బుమ్రా.. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ బౌలింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బుమ్రా ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా కాపాడుకోవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దీనిపై అప్డేట్ ఆదివారం వచ్చే అవకాశముంది.
సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్..
ఇక ఐదు టెస్టుల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా 32 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో బీజీటీలో అత్యధిక వికెట్లు తీసిన హర్భజన్ సింగ్ (2001-32 వికెట్లు) రికార్డును సమం చేశాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు (36) తీసిన బౌలర్ గా బుమ్రా నిలుస్తాడు. ఆదివారం ఒకవేళ ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించినట్లయితే బుమ్రా బౌలింగ్ కు దిగి ఈ రికార్డు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు బుమ్రా గైర్హాజరీలో భారత బౌలర్లు గొప్పగా ఆడారు. ప్రసిధ్, సిరాజ్ మూడు వికెట్లు, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయడంతో ఆసీస్ 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో 4 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో రోజు ఆటముగిసేసరికి భారత్ 141/6తో నిలిచింది. ప్రస్తుత భారత లీడ్ 145 పరుగులుగా ఉంది.
Also Read: Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్