ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ లో 5G సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. 4G,  3G సేవలతో  పోలిస్తే 5G సేవలం అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే మిలియన్ల మంది భారతీయులు 5G సేవలను ఆస్వాదిస్తున్నారు.    వేగవంతమైన స్ట్రీమింగ్, గేమింగ్ అనుభవాన్ని పొందుతున్నారు. అయితే, విమానాశ్రయాలకు సమీపంలో నివసించే వినియోగదారులు ఇప్పట్లో 5G పొందే అవకాశం లేదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఎయిర్ పోర్టుల సమీపంలో 5G బేస్ స్టేషన్లు వద్దు


దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలకు 2.1 కి.మీ పరిధిలో C-band 5G బేస్ స్టేషన్లను ఇన్‌ స్టాల్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టెలికాం ప్రొవైడర్లు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్‌లకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) లేఖ రాసింది. C-band 5G కారణంగా విమానాశ్రయంలోని రాడార్ లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పర్వతాలను ఢీకొట్టకుండా ఉండేందుకు, పైలట్లు పూర్తిగా రేడియో (రాడార్) ఆల్టిమీటర్లపై ఆధారపడతారు.


రన్‌ వే రెండు చివరల నుంచి 2,100 మీటర్లు,  ఎయిర్‌ పోర్ట్‌ల మధ్య రన్‌వే నుంచి 910 మీటర్ల దూరంలో 3,300-3,670లో 5G/ IMT MHz బేస్ స్టేషన్‌ లు ఉండకూడదని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు (TSPలు) సూచించినట్లు DoT తన లేఖలో వెల్లడించింది. ఎయిర్‌టెల్, నాగ్‌పూర్, బెంగళూరు, న్యూఢిల్లీ, గౌహతి, పూణెలోని విమానాశ్రయాలలో 5G బేస్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసింది. Jio ఢిల్లీ-NCR ప్రాంతంలో 5G బేస్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసింది. అయితే, DGCA ద్వారా అన్ని ఎయిర్‌క్రాఫ్ట్ రేడియో ఆల్టిమీటర్స్ ఫిల్టర్‌ల భర్తీని నిర్ధారించే వరకు ఈ నిబంధన వర్తిస్తుందని DoT తెలిపింది. “డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌క్రాఫ్ట్ రేడియో ఆల్టిమీటర్స్ ఫిల్టర్‌ల భర్తీ  సమయానుకూలంగా నిర్ధారిస్తుంది. అప్పటి వరకు 5G బేస్ స్టేషన్‌లను ప్రారంభించకూడదు” అని DoT లేఖలో వెల్లడించింది. 


హైస్పీడ్ 5Gతో విమాన రాడార్లలో సమస్యలు


హై స్పీడ్ 5G వైర్‌ లెస్ నెట్‌వర్క్‌ లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో, USలోని పైలట్లు కూడా విమానం రేడియో (రాడార్) ఆల్టిమీటర్‌లతో తరచుగా సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. NASA యొక్క ఏవియేషన్ సేఫ్టీ రిపోర్టింగ్ సిస్టమ్ (ASRS)కి చేసిన IEEE స్పెక్ట్రమ్ (ప్రపంచంలోని ప్రముఖ ఇంజనీరింగ్ మ్యాగజైన్) నివేదికల విశ్లేషణ ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభంలో హై-స్పీడ్ 5G వైర్‌ లెస్ నెట్‌వర్క్‌ ల రోల్ అవుట్ తర్వాత ఆల్టిమీటర్‌లు పనిచేయకపోవడం, విఫలమవుతున్నట్లు ఫిర్యాదులు పెరిగాయి.  ఒక జెట్ దాని ఆటోపైలట్‌ నియంత్రణను పూర్తిగా కోల్పోయింది. మార్చిలో, లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లో ఆటోపైలట్‌ లో దిగిన కమర్షియల్ జెట్ అకస్మాత్తుగా 100 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగింది.  విమానం రేడియో ఆల్టిమీటర్‌లతో సమస్యలతో ఈ ఘటనలు జరిగినట్లు తేలింది.  ముందస్తు జాగ్రత్తగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ పోర్టుల సమీపంలో 5G స్టేషన్ల ఏర్పాటును నిలిపివేయాలని సూచించింది.


Read Also: 5జీ నుంచి డిజీ రూపీ వరకు - టెక్నాలజీ పెరిగిపోయింది భయ్యా!