కొత్త సంవత్సరం రాబోతుంది. మరో క్రీడా సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. పొట్టి క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఈ ఏడాది తమ మార్కు ఆటతీరుతో అబ్బురపరిచారు. అలా టీ 20 క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన  వారిలో టీమిండియా టీ 20 సారధి  సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన పది మంది ఆటగాళ్లు ఎవరో ఓసారి మననం చేసుకుందాం...


2023వ సంవత్సరంలో ఆశ్చర్యకరంగా యూఏఈ ఆటగాడు మహ్మద్ వసీమ్ అత్యధిక పరుగులు చేశాడు. దిగ్గజ ఆటగాళ్లను తోసిరాజని ఈ యూఏఈ ఆటగాడు సత్తా చాటాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం కూడా ఈ ఆటగాడికి కలిసివచ్చింది. మహ్మద్‌ వసీం మొత్తం 21 ఇన్నింగ్స్‌లలో 40.30 సగటు, 163.15 స్ట్రైక్ రేట్‌తో 806 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మహ్మద్‌ వసీం అత్యధిక స్కోరు   91 పరుగులు. ఈ ఏడాది ఈ యూఏఈ టాప్‌ బ్యాటర్‌ 74 ఫోర్లు, 51 సిక్సర్లు బాదాడు. టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది ఇప్పటివరకు 17 టీ 20 మ్యాచ్‌లు ఆడిన సూర్య భాయ్‌ 16 ఇన్నింగ్స్‌లలో 45.21 సగటు, 152.89 స్ట్రైక్ రేట్‌తో 633 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ... 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లలో భారత జట్టు తరపున సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడికే స్థానం దక్కింది. 2021లో టీ 20లో అరంగేట్రం చేసిన సూర్య... భీకర ఫామ్‌తో ప్రత్యర్థి జట్ట బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తున్నాడు. సఫారీ గడ్డపై జరుగుతున్న టీ 20 సిరీస్‌లోనూ తాజాగా సెంచరీ చేసి సత్తా చాటాడు.  


2023 ఏడాదిలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
మహ్మద్ వాసిమ్ (యుఎఇ) - 806 పరుగులు
సైమన్ స్సేసాజీ (ఉగాండా) - 671 పరుగులు
విరందీప్ సింగ్ (మలేషియా) - 665 పరుగులు
రోజర్ ముకాసా (ఉగాండా) - 658 పరుగులు
సూర్యకుమార్ యాదవ్ (భారత్‌)- 633
సయ్యద్ అజీజ్ (మలేషియా) - 559 పరుగులు
మార్క్ ఛాంప్‌మన్ (న్యూజిలాండ్) - 556 పరుగులు
కాలిన్స్ ఒబుయా (కెన్యా) - 549 పరుగులు
కాము లావెరోక్ (బెర్ముడా) - 525 పరుగులు
సికందర్ రజా (జింబాబ్వే) – 515 పరుగులు.


అర్హత పోటీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం వల్ల యూఏఈ, కెన్యా, జింబాబ్వే వంటి పసికూన జట్ల ఆటగాళ్లు అగ్రస్థానంలో ఉన్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌, న్యూజిలాండ్‌కు చెందిన మార్క్‌ ఛాంప్‌మన్‌ తప్ప మిగిలిన  ఆటగాళ్లు అందరూ పసికూన జట్లకు చెందిన ఆటగాళ్లు కావడం గమనార్హం. భారత్‌, న్యూజిలాండ్‌కు తప్ప మరే అగ్ర శ్రేణి జట్టు బ్యాటర్‌కు కూడా 2023లో టీ 20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి జాబితాలో చోటు దక్కలేదు.