GG vs MI Women: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మొదటి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ నుంచి యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ ఓపెనింగ్‌కు వచ్చారు. ఇందులో యస్తికా భాటియా మహిళల ఐపీఎల్ తొలి బంతిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున టోర్నీ తొలి బంతిని యాష్లే గార్డ్‌నర్ బౌల్ చేసింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ గుజరాత్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. టోర్నీలో తొలి ఓవర్ వేసిన యాష్లే గార్డ్‌నర్ కూడా ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్లేయర్. యాష్లే గార్డ్‌నర్ తొలి ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చింది. టోర్నీ తొలి ఓవర్‌లో మొత్తం నాలుగు బంతులు డాట్ బాల్స్ కాగా, ఐదు, ఆరు బంతుల్లో ఒక్కో పరుగు వచ్చింది. ముంబై తరఫున ఆడుతున్న భారత బ్యాటర్ యస్తికా భాటియా మహిళల ఐపీఎల్ చరిత్రలో తొలి పరుగు సాధించింది.
టోర్నీలో భారత బౌలర్ తనూజా కన్వర్ తొలి వికెట్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ యస్తికా భాటియాను పెవిలియన్ బాట పట్టేలా చేసింది. యస్తికా భాటియా ఎనిమిది బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకుంది. దీంతో మహిళల ఐపీఎల్‌లో మొదట అవుటైన బ్యాటర్‌గా యస్తికా నిలిచింది.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ సెవెర్ బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలితా మరియు సయ్కా ఇషాక్
గుజరాత్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్
అథ్ మూనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాలన్ హేమ్లత, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి
డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తొలి ఎడిషన్‌లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ఉన్నాయి.
ఈ సీజన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?
ఈ సీజన్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లను మొత్తం సీజన్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కలిగి ఉన్న స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రి 7:30 గంటలకు చూడవచ్చు. ఈ మ్యాచ్ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ను జియో సినిమా యాప్, వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. మ్యాచ్‌ను 4కే స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంది.