Wimbledon 2023: లండన్ వేదికగా జరుగుతున్న వింబూల్డన్‌లో పెను సంచలనం. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్, ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న పోలాండ్ యువ సంచలనం ఇగా స్వియోటెక్‌కు భారీ షాక్. వింబూల్డన్ తొలి క్వార్టర్స్ పోరులో ఉక్రెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 76వ ర్యాంకర్ ఎలీనా స్వితోలినా.. స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో స్వితోలినా.. 7-5, 6-7 (5/7), 6-2 తేడాతో స్వియాటెక్‌ను ఓడించింది.
ఆద్యంతం హోరాహోరిగా జరిగిన ఈ పోరులో తొలి సెట్‌ను స్వియాటెక్ గెలుచుకుంది. కానీ తర్వాత స్వితోలినా పట్టు విడవకుండా పోరాడింది. రెండో సెట్‌ను ఉక్రెయిన్ క్రీడాకారిణి గెలుచుకోవడంతో మూడో సెట్‌పై ఆసక్తి పెరిగింది. అయితే స్వితోలినా.. మూడో సెట్‌లో స్వియాటెక్‌కు పుంజుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. వరుస సెట్లు గెలుచుకుని ఫ్రెంచ్ ఓపెన్ విజేతను మట్టికరిపించింది.
రెండో క్వార్టర్స్‌లో వొండ్రుసోవా (చెక్) 6-4, 2-6, 6-4 తేడాతో నాలుగో సీడ్, అమెరికాకు చెందిన పెగులాను ఓడించి సెమీస్ చేరింది. సెమీఫైనల్‌లో స్వితోలినా.. ఒండ్రుసోవాతో తలపడనుంది. వింబూల్డన్ సెమీస్‌కు చేరడం స్వితోలినాకు ఇది రెండోసారి.
ఉక్రెయిన్ యుద్ధం చాలా నేర్పింది : స్వితోలినా
స్వియాటెక్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత స్వితోలినా భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. ఏడాదిన్నరకు పైగా రష్యాతో యుద్ధంలో నలిగిపోతున్న ఉక్రెయిన్ ను ప్రత్యక్షంగా చూసిన ఆమె.. యుద్ధమే తనను చాలా స్ట్రాంగ్‌గా చేసిందని తెలిపింది. ‘ఉక్రెయిన్ యుద్ధం నన్ను మానసికంగా చాలా దృఢంగా తయారుచేసింది. గతంలో నేను ఏదైనా ప్రకృతి వైపరిత్యాలు, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడేదాన్ని. కానీ యుద్ధం వల్ల నేను వాటిని ధీటుగా ఎదుర్కుని ఇక్కడికి రాగలిగాను..’ అని చెప్పుకొచ్చింది.
28 ఏండ్ల స్వితోలినా.. వాస్తవానికి గతేడాది అక్టోబర్ లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆమె తిరిగి టెన్నిస్ రాకెట్ పట్టింది. ఓ బిడ్డకు తల్లిగా వింబూల్డన్ లో అడుగుపెట్టిన స్వితోలినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోర్నీ ఆడుతోంది. సెమీఫైనల్ చేరే క్రమంలో ఆమె.. మాజీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్స్ వీనస్ విలియమ్స్, సోఫియా కెనిన్, విక్టోరియా అజరెంక లను ఓడించి క్వార్టర్స్ చేరింది. క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ స్వియాటెక్‌ను ఓడించడం గమనార్హం.