టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా భావోద్వేగానికి గురవుతున్నాడు! తన అరంగేట్రం టెస్టు మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయని అంటున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు.


జస్ప్రీత్‌ బుమ్రా మొదట ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడాడు. తన వేగం, తెలివి తేటలు, ఆటను అధ్యయనం చేసే తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. పరుగులను నియంత్రిస్తూ, వికెట్లు తీస్తూ కీలకంగా మారాడు. ఆ తర్వాత వన్డేల్లో ప్రవేశించి డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా అవతరించాడు. ఈ తరుఫు ముక్కను కొన్నాళ్లు సానబెట్టిన జట్టు యాజమాన్యం 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేయించింది.






టీమ్‌ఇండియా నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో పర్యటించింది. జనవరి 5న మూడో టెస్టును కేప్‌టౌన్‌లో ఆడింది. అదే మ్యాచులో జస్ప్రీత్ బుమ్రాను సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దించింది. అతడు ఒక వికెట్టే తీసినప్పటికీ ఆ తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ, ప్రమాదకర పేసర్లలో ఒకరిగా అవతరించాడు. ఇప్పటి వరకు 26 టెస్టులాడి 107 వికెట్లు తీశాడు. తాజా పర్యటనలోనూ మూడో టెస్టును కోహ్లీసేన కేప్‌టౌన్‌లోనే ఆడుతోంది. ఈ నేపథ్యంలో బుమ్రా భావోద్వేగానికి గురయ్యాడు.






'కేప్‌టౌన్‌, జనవరి 2018- టెస్టు క్రికెట్లో నా ప్రస్థానం ఇక్కడే ఆరంభమైంది. నాలుగేళ్లు గడిచాయి. నేను ఆటగాడిగా, వ్యక్తిగా మరింత ఎదిగాను. మళ్లీ ఇదే మైదానానికి రావడంతో నాకెన్నో మధుర స్మృతులను గుర్తుకు తెస్తోంది' అని బుమ్రా ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. బీసీసీఐ సైతం సోషల్‌ మీడియాలో బుమ్రా అరంగేట్రాన్ని గుర్తు చేసుకుంది. 'అలా మొదలైంది.. ఇలా సాగుతోంది' అంటూ అతడి చిత్రాలను పంచుకుంది.


Also Read: ప్రపంచకప్‌ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!


Also Read: ధోనిని కించపరుస్తూ కేకేఆర్ ట్వీట్.. జడ్డూ దిమ్మదిరిగే రిప్లై.. అది కేవలం షో ఆఫ్ మాత్రమే!


Also Read: Rahul Dravid Birthday: రాహుల్‌ ద్రవిడ్‌కు డబ్బంటే చేదా? అతడికా ఉద్దేశం లేదా?