ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’నే. 1993లో ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గ్యాటింగ్‌ను అవుట్ చేసిన ఆ బంతిని ఎవరూ సులభంగా మర్చిపోలేరు. ఎక్కడో లెగ్ స్టంప్ బయట పడ్డ బంతి సడెన్‌గా లోపలికి తిరిగి ఆఫ్‌స్టంప్ పైనున్న బెయిల్స్‌ను ఎగరేయడం విశేషం. ఈ బంతి దాదాపు 90 డిగ్రీల మేర టర్న్ అయిందని అంచనా.
అసలు ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందో చూస్తే... టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ గ్రాహం గూచ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మార్క్ టేలర్ (124: 233 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ, మైకేల్ స్లేటర్ (58: 131 బంతుల్లో, ఏడు ఫోర్లు) అర్థ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకు ఆలౌట్ అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 71 పరుగుల వద్ద మైక్ అథర్టన్ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో మైక్ గ్యాటింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వెంటనే ఆస్ట్రేలియన్ కెప్టెన్ అలన్ బోర్డర్ షేన్ వార్న్‌ను బౌలింగ్‌కు దించాడు. అప్పుడు షేన్ వార్న్ చేతులు అద్భుతాన్ని చేశాయి. తను వేసిన అద్భుతమైన బంతి లెగ్ స్టంప్ బయట పడి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. బంతి టర్న్‌ను సరిగ్గా గమనించని మైక్ గ్యాటింగ్ ఆశ్చర్యపోతూ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్ అస్సలు కోలుకోలేదు. 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాకు 79 పరుగుల ఆధిక్యం దక్కింది. షేన్ వార్న్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇయాన్ హీలీ (102 నాటౌట్), స్టీవ్ వా (78 నాటౌట్), డేవిడ్ బూన్ (93), మార్క్ వా (64) రాణించడంతో ఆస్ట్రేలియా 432-5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 512 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా షేన్ వార్న్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. గ్రాహం గూచ్ (133) సెంచరీతో రాణించినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 179 పరుగులతో విజయం సాధించింది.