Amaravati Hotels: ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో హోట‌ళ్ల ప‌రిశ్రమ పూర్తిగా మూసుకుపోయింది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉన్న స‌మ‌యంలో బ‌తుకుతెరువు కోసం కొంద‌రు చిన్న చిన్న హోట‌ళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫుడ్ బిజినెస్ కు ఉన్న డిమాండ్ నేప‌థ్యంలో కొన్ని పెద్ద హోటళ్లు కూడా వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. ఒకప్పుడు రాజ‌ధాని గ్రామంలో సుమారు 40కి పైగా హోట‌ళ్లు నడిచేవి. ఇప్పుడు మాత్రం అవేమి క‌నిపించ‌టం లేదు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నిర్ణయం రాగానే అమరావతిలో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ త‌రువాత కోవిడ్ ప్రభావంతో వ్యాపారాలు లేక దాదాపుగా అన్ని హోట‌ళ్లు మూత‌బ‌డ్డాయి. ప్రస్తుతం రాజ‌ధాని ప్రాంతంలో ఫుడ్ కావాలంటే అంత ఈజీ కాదు. ఉద‌యం టిఫ‌న్ తో పాటుగా మ‌ధ్యాహ్నం లంచ్ కావాలంటే ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇక రాత్రి పూటయితే అస‌లు ఫుడ్ దొరికే ఛాన్సే లేదు. 


పూర్తిగా మూతపడ్డ ఫుడ్ బిజినెస్ 


రాజ‌ధాని నిర్మాణం కోసం వ‌చ్చిన కూలీలు ప‌నులు లేక వెళ్లిపోవ‌టం, మంత్రులు, శాస‌న స‌భ్యులు అసెంబ్లీ స‌మావేశాలు, కేబినేట్ స‌మావేశాలుంటే త‌ప్ప సచివాలయానికి వ‌చ్చే అవకాశం లేక‌పోవ‌టంతో బ‌య‌ట నుంచి వ‌చ్చే వారి సంఖ్య భారీగా త‌గ్గిపోయింది. దీంతో హోట‌ళ్లన్నీ మూత‌బ‌డిపోయాయి. చిన్నాచిత‌కగా ఉన్న ఒక‌టి రెండు హోట‌ళ్లు అప్పుడ‌ప్పుడూ ఉద‌యం టిఫిన్ వ‌ర‌కు వ్యాపారాలు చేసుకుంటున్నారు. హోట‌ళ్లతో పాటుగా బ్యాక‌రీలు, టీ స్టాల్స్ కూడా పూర్తిగా మూసివేశారు. కేవ‌లం హోట‌ల్ వ్యాపారం కోసం ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు ఇప్పుడు ఖాళీగా పాడుబ‌డిపోయాయి. అంతే కాదు రాజ‌ధాని స‌మ‌యంలో భారీ ప్రాజెక్ట్ ల‌తో స్టార్ హోట‌ళ్లకు కూడా శంకుస్థాప‌న చేశారు. ఇప్పుడు అవి కూడా క‌నిపించ‌టం లేదు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో మ‌ర‌లా హోట‌ల్ బిజినెస్ ఊపందుకుంటుంద‌ని రాజ‌ధాని వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


హైకోర్టు తీర్పు 


ఏపీలో మూడు రాజధానుల (AP Three Capitals) విషయంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వానికి హైకోర్టు (High Court) భారీ షాక్ ఇచ్చింది. గురువారం మూడు రాజధానులు, సీఆర్డీఏ (CRDA) రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని ప్లానింగ్‌ను (AP Capital Planning) వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.