టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 500 పరుగులు, 50 వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు. సెయింట్ కీట్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో మ్యాచులో అతడీ రికార్డు సాధించాడు.
ఈ మ్యాచులో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. కైల్ మేయర్స్‌తో కలిసి బ్రాండన్ కింగ్ 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించాడు. అతడిని ఔట్ చేయడం ద్వారా పాండ్య ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. 50 టీ20 వికెట్లు పడగొట్టిన ఆరో భారతీయుడిగా నిలిచాడు. అంతకు ముందు మ్యాచులోనే రవీంద్ర జడేజా 50 వికెట్ల రికార్డు అందుకోవడం గమనార్హం.
అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు, 500 పరుగుల ఘనత సాధించిన 11వ ఆటగాడు హార్దిక్ పాండ్య నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో మొత్తంగా 30వ క్రికెటర్. భారత్‌లో ఈ డబుల్ రికార్డును గతంలో ఒకే ఒక్కరే సాధించారు. మహిళా క్రికెటర్ దీప్తి శర్మ 65 వికెట్లు, 521 పరుగులు సాధించింది.
హార్దిక్ పాండ్య 2016లో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆరంభం నుంచీ అదరగొట్టాడు. రెండేళ్ల క్రితం వెన్నెముక సర్జరీతో కొన్నాళ్లు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత పునరాగమం చేసినా బౌలింగ్ మాత్రం చేయలేదు. దాంతో ఆరు నెలలు ఇంటివద్దే ఉన్న పాండ్య బౌలింగ్ ఫిట్‌నెస్ సైతం సాధించాడు. ఐపీఎల్ 2022లో అదరగొట్టాడు. తన బౌలింగ్‌లో మరిన్ని మార్పులు చేసుకున్నాడు. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20ల్లో 8, వన్డేల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండుసార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.
IND vs WI 3rd T20 Highlights: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 7 వికెట్ల తేడాతో సిరీసులో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (76; 44 బంతుల్లో 8x4,4x6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రిషభ్ పంత్ (33*; 26 3x4, 1x6) అజేయంగా నిలిచాడు. అంతకు ముందు విండీస్‌లో కైల్ మేయర్స్ (73; 50 బంతుల్లో 8x4,4x6) విజృంభించాడు. రోమన్ పావెల్ (23), నికోలస్ పూరన్ (22) ఫర్వాలేదనిపించారు.