Watch Rafael Nadal wins hearts with lovely gesture towards Zverev as he retires from French Open : ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచేందుకు రఫెల్‌ నాదల్‌ (Rafael Nadal) మరో అడుగు దూరంలో నిలిచాడు. ఎర్రమట్టి కోర్టు రారాజుగా తన స్థానం మరింత పదిలం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. హోరాహోరీగా జరుగుతున్న సెమీస్‌లో ప్రత్యర్థి అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (Alexander Zverev) గాయంతో వెనుదిరిగడంతో రఫెల్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. నడవలేకపోతున్న జ్వెరెవ్‌ను గుండెలకు హత్తుకొని క్రీడాస్ఫూర్తిని చాటాడు. అభిమానుల మనసు గెలచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే రఫెల్‌ నాదల్‌ చెలరేగిపోతాడు. ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించి సెమీస్‌ చేరుకున్నాడు. శుక్రవారం అతడి 36వ పుట్టిన రోజు. ఫిలిప్‌ ఛార్టర్‌ కోర్టులో జ్వెరెవ్‌తో తలపడ్డాడు. 7-6 (8), 6-6తో హోరాహోరీగా మ్యాచ్‌ సాగుతోంది. రెండో సెట్‌లో 12వ గేమ్‌లో నాదల్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌కు బదులిచ్చే క్రమంలో అతడు చీలమండ గాయంతో విలవిల్లాడు. వెంటనే అతడిని వీల్‌ఛైర్‌లో చికిత్స చేసేందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత క్రచెస్ పట్టుకొని జ్వెరెవ్‌  కన్నీళ్లతో కోర్టు వద్దకు వచ్చాడు. అభిమానులకు చేతులూపుతూ నిలబడ్డాడు. నాదల్‌ అతడి వద్దకొచ్చి వెంటనే హత్తుకున్నాడు. దాంతో సోషల్‌ మీడియాలో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.




'ఇదెంతో కఠినం! జ్వెరెవ్‌ గురించి బాధపడుతున్నాను. నిజాయతీగా చెబుతున్నా! అతడు టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నాడు. గ్రాండ్‌శ్లామ్‌ గెలిచేందుకు అతడెంతో పోరాడుతున్నాడు. దురదృష్టం అతడిని వెంటాడింది. నేనొక మాట కచ్చితంగా చెప్పగలను. ఒకటి కాదు అతడెన్నో గ్రాండ్‌శ్లామ్‌లు గెలుస్తాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. 3 గంటలు దాటినా సెమీస్‌లో రెండో సెట్టే పూర్తవ్వలేదు. ఈ స్థాయిలో ఆడుతుంటే అతడిపై గెలవడం చాలా కష్టం' అని నాదల్‌ అన్నాడు.