Wasim Jaffer on Pant: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్ (Rishabh Pant) ఆడటం కష్టమేనని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ అంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ వికెట్ కీపింగ్ చేసే నేపథ్యంలో అతడు ఆడటం సందిగ్ధమేనని వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో నాలుగో మ్యాచుకు ముందు జాఫర్ మీడియాతో మాట్లాడాడు.
'మనకు కేఎల్ రాహుల్ ఉన్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే సులువుగా జట్టులోకి వచ్చేస్తాడు. అతడు వికెట్ కీపింగ్ చేస్తాడన్న సంగతి మరవొద్దు. ఇక దినేశ్ కార్తీక్ ఆడే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అతడూ వికెట్ కీపరే. అలాంటప్పుడు రిషభ్ పంత్ గురించి నేను హామీ ఇవ్వలేను. ప్రస్తుత ఫామ్ ప్రకారం రిషభ్ పంత్‌కు చోటు దక్కడం కష్టమే' అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో వసీమ్ జాఫర్ తెలిపాడు.
Also Read: టీమ్‌ఇండియా విమానంలో పొగలు! హీరోలా మారిన డీకే.. ఆ తర్వాత!
'రిషభ్ పంత్ పరుగులు బాకీ ఉన్నాడు. అతడు నిలకడగా రన్స్ చేయాలి. ఐపీఎల్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రమే. నేను చాలాసార్లు చెప్పాను. టెస్టు క్రికెట్లో అతడు అద్భుతంగా ఆడాడు. వన్డేల్లోనూ కొన్ని మంచి ఇన్నింగ్సులు ఉన్నాయి. టీ20ల్లో మాత్రం అలా లేడు. నా వరకైతే టీ20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌కు చోటు కష్టమే' అని జాఫర్ పేర్కొన్నాడు.
నిజానికి పొట్టి క్రికెట్లోనే రిషభ్ పంత్‌కు మంచి పేరుంది. ఐపీఎల్‌లో అతనాడిన ఇన్నింగ్సులకు ఎంతో మంది ఫిదా అయ్యారు. ఎంతటి బౌలర్‌నైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. వినూత్నమైన షాట్లు ఆడేవాడు. అలాంటిది అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఆశించిన రీతిలో ఆడటం లేదు. భారీ స్కోర్లు చేయలేదు. దక్షిణాఫ్రికా సిరీసులోనూ 29, 5, 6 పరుగులే చేశాడు. అటాకింగ్ కాకుండా డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నాడు.
Also Read: రాజ్‌కోట్‌లో రన్స్ ఫెస్ట్! పంత్ సేన సిరీస్ సమం చేసేనా?