అనుకున్నదే జరిగింది! జాతీయ క్రికెట్ అకాడమీ అధినేతగా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయం ధ్రువీకరించారు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా అతడే సరైన వాడని దాదా భావిస్తున్నాడు.
రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో రాహుల్ ద్రవిడ్ టీమ్‌ఇండియా కోచ్‌గా ఎంపికయ్యాడు. కొన్నిరోజుల కిందటే అతడు బాధ్యతలు తీసుకున్నాడు. దాంతో బెంగళూరులోని ఎన్‌సీయే చీఫ్ పదవి ఖాళీ అయ్యింది. రాహుల్ స్థాయిలో వ్యక్తి మరొకరు అవసరం కాబట్టి వీవీఎస్ లక్ష్మణ్‌ను గంగూలీ సంప్రదించాడు. మొదట వీవీఎస్ సుముఖత వ్యక్తం చేయకపోయినా దాదా తీవ్రంగా చర్చించి అతడిని ఒప్పించాడని తెలిసింది.
క్రికెటర్‌గా అద్భుతాలు చేసిన లక్ష్మణ్ ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా స్థిరపడ్డాడు. ఆ తర్వాతి సమయంలో క్రికెట్ కామెంటరీ చేస్తున్నాడు. బెంగాల్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగానూ ఉన్నాడు. ఇక సొంతంగా హైదరాబాద్‌లో క్రికెట్ అకాడమీలు నిర్వహిస్తున్నాడు. తాజాగా అతడు కీలకమైన ఎన్‌సీయేకు ఎంపికయ్యాడు.
భారత క్రికెట్ జట్టుకు ఒకప్పుడు సచిన్‌తో పాటు గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ మూలస్తంభాలు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు సచిన్ మెంటార్‌గా ఉన్నాడు. అయితే దాదా, ద్రవిడ్, లక్ష్మణ్ తిరిగి బీసీసీఐలో పదవులు చేపట్టడం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. యువ క్రికెటర్లను వారు తీర్చిదిద్దుతున్నందుకు సంతోషిస్తున్నారు.
Also Read: T20 World Cup 2021: మీమ్ క్రియేటర్లకు షాక్..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!
Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి