సరిగ్గా ఆరేళ్ల క్రితం తన చెల్లిని కలవడానికి  మోటార్ బైక్ పై బయల్దేరాడు డేనియల్. అప్పుడతని వయసు పాతికేళ్ల కన్నా ఎక్కువ ఉండవు. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడంతో చివరిలో బండి ఆపి నిల్చున్నాడు. ఇంతల్లోపు వెనుకనుంచి ఓ పెద్ద వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది. బండితో సహా ఎగిరిపడ్డాడు. ఆ వచ్చిన వ్యాన్ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. డేనియల్ ను ఆసుపత్రిలో చేర్పించారు చుట్టుపక్కల వాళ్లు. ప్రాణాపాయమేమీ లేదని చెప్పారు వైద్యులు. తగిలిన దెబ్బలు అంత పెద్దవేమీ కాదు. కానీ కనిపించని పెద్ద దెబ్బ మెదడుకు తగిలింది. దాన్ని వైద్యులు గుర్తించలేకపోయారు. డేనియల్ కు ఆసుపత్రిలో తెలివి వచ్చాక అడిగిన ప్రశ్న ‘నేను ఎవరిని?  ఎందుకు ఇక్కడ ఉన్నాను’ అని. అప్పుడర్ధమైంది వైద్యులకు మెదడుపై యాక్సిడెంట్ ప్రభావం బాగా పడిందని, కొంతభాగం సరిగా పనిచేయడం లేదని. అప్పట్నించి డేనియల్ లైఫ్ మారిపోయింది. ప్రతి ఆరుగంటలకోసారి అతను అంతా మరిచిపోతాడు. వైద్యులు ఎన్నో థెరపీలు, మందులు ప్రయత్నించారు. కానీ ఏవీ డేనియల్ ను సాధారణ మనిషిని చేయలేకపోయాయి. ఇతను నివసించేది అమెరికాలో. 


గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది
యాక్సిడెంట్ కు ముందు డేనియల్ ప్రేమలో ఉన్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక ఆమెను కూడా అతడు గుర్తుపట్టలేకపోయాడు. కొత్తవ్యక్తిలా వ్యవహరించసాగాడు. దీంతో విసిగేసి ఆమె అతడిని వదిలేసింది. చిన్నప్పట్నించి తాను కలిసి పెరిగిన స్నేహితులను కూడా మర్చిపోయాడు. దీంతో వారు కూడా దూరం పెట్టారు. డేనియల్ కు తన సమస్య పూర్తిగా అర్థమైంది. ఇలా అయితే జీవితం మరింత భారమవుతుందనుకున్నాడు.


డైరీ తప్పనిసరి
డైరీ రాసే అలవాటు చేసుకున్నాడు. ఆరోజు తాను కలిసిన మనుషులు, ప్రదేశాలు, పనులు ఇలా ప్రతిది డైరీలో రాసుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి ఆరుగంటలకోసారి అది తీసి చదువుతూ ఉంటాడు. దీని వల్ల ఆయనకు ఎంతో కొంత మేలు జరుగుతోంది. గజిని సినిమాలో సూర్యలా ఫోటోలు కూడా తీసిపెట్టుకుంటున్నాుడు. అతని ఫోన్ నిండా ఆరోజు తాను కలిసిన వారు ఫోటోలే ఉంటాయి. ఇతని ఆరోగ్యసమస్యకు పరిష్కారం లేదని చెప్పేశారు వైద్యులు. 


కొడుకు ఉన్నాడన్న సంగతి కూడా...
ఇతని పరిస్థితి తెలిసి కూడా ఓ అమ్మాయి డేనియల్ ను ప్రేమించింది. రెండేళ్ల వారి సహజీవనానికి గుర్తుగా ఓ బాబు పుట్టాడు. పాపం డేనియల్ మెదడు నుంచి ప్రతి ఆరుగంటలకోసారి ఆటోమేటిక్ గా విషయాలన్నీ చెరిగిపోతున్నాయి. అలాగే బాబు పుట్టిన సంగతి కూడా రోజూ మర్చిపోతాడు. డైరీలో చాలా భాగాన్ని తన బాబు పుట్టిన విషయాన్నే రాసుకున్నాడు. తనతో కలిసి ఉన్న ఫోటోలను కూడా ప్రింట్లు తీసి పెట్టుకున్నాడు. 


Also read:  భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?


Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?


Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...



Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి