Kohli T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మళ్లీ తన జోరు చూపించాడు. ఆసియాకప్‌ ప్రదర్శనతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. ప్రపంచ 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక శ్రీలంక మిస్టరీ స్పిన్న్‌ర్‌ వనిందు హసరంగ 3 స్థానాలు మెరుగై ఆరో ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అతడు 7 స్థానాలు ఎగబాకి 4కు చేరుకోవడం ప్రత్యేకం.


నెల రోజులు విశ్రాంతి తీసుకోవడం, అంతకు ముందు భారీ స్కోర్లు చేయకపోవడంతో విరాట్‌కోహ్లీ ర్యాంకు పడిపోయింది. ఏకంగా 29కి చేరుకున్నాడు. ఆసియాకప్‌లో ఫామ్‌ అందుకోవడంతో మళ్లీ ర్యాంకుల వేటను ఆరంభించాడు. అఫ్గాన్‌పై భారీ సెంచరీ చేయడం, అంతకు ముందు హాంకాంగ్‌, పాకిస్థాన్‌పై హాఫ్‌ సెంచరీలు సాధించడం, టోర్నీలో రెండో టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో అతడి ర్యాంకు మెరుగైంది. ఏకంగా 14 ర్యాంకులు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.


టీమ్‌ఇండియా నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే టాప్‌-5లో ఉన్నాడు. 755 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ 14, ఇషాన్‌ కిషన్‌ 22, కేఎల్‌ రాహుల్‌ 23 స్థానాల్లో ఉన్నారు. ఆసియాకప్‌ టాప్‌ స్కోరర్‌, పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ 810 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ జాబితాలో భువనేశ్వర్‌ కుమార్‌ ఒక ర్యాంక్‌ తగ్గి ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య 160 రేటింగ్‌తో ఏడో ప్లేస్‌లో ఉన్నాడు.


ఫామ్‌ అందుకోవడం సంతోషం


Virat Kohli interview with Rohit Sharma: తాను నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం తిరిగి పరుగులు చేస్తున్నానని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. మళ్లీ పాత టెంప్లేట్‌ ప్రకారం ఆడుతున్నానని పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో సెంచరీ చేస్తానని అస్సలు అనుకోలేదని చెప్పాడు. అఫ్గాన్‌పై సెంచరీ తర్వాత అతడు మాట్లాడాడు. బీసీసీఐ ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చిన సంగతి తెలిసిందే.


'మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్టుగా బాధ్యతలు తీసుకోవడమే నాకిచ్చిన బాధ్యత. ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలన్న డిమాండ్‌ వస్తే అదీ చేయాల్సిందే. నా జోన్‌లో ఉంటే కచ్చితంగా నేనా పనిచేస్తాను. ఆ తర్వాత రిలాక్స్‌ అవుతాను. ఎందుకంటే 10-15 బంతులాడితే నేను ఎక్కువ వేగం పెంచగలను' అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.


'జట్టు కోణంలో చూస్తే నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కొన్నాళ్లేగా నేను సృష్టించుకున్న టెంప్లేట్‌ ప్రకారం తిరిగి ఆడుతున్నాను. నిరంతరం మ్యాచులు ఆడటం, ఎడతెరపి లేకుండా శ్రమించడం, నాది కాని మ్యాచులోనూ పరుగుల కోసం ఫేక్‌ ఇంటెన్సిటీ చూపించాను. విశ్రాంతి తీసుకోవడం మునుపటి శైలిలో రన్స్‌ చేస్తున్నాను' అని విరాట్‌ వివరించాడు.