ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కరోనా వైరస్‌ బారిన పడ్డాడని తెలిసింది. జట్టులోని మరికొందరికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని సమాచారం. దాంతో లీసెస్టర్‌లో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌పై నీలి మబ్బులు కమ్ముకున్నాయి.


గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు కోసం టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌కు వెళ్లింది. జులై 1-5 మధ్య ఈ మ్యాచ్‌ జరుగుతుంది. అయితే జట్టులోని కొందరికి వైరస్‌ సోకడంతో మ్యాచ్‌పై సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటికే కరోనా సోకడంతో సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టు సభ్యులతో పాటు ఇంగ్లాండ్‌కు వెళ్లలేదు. తాజాగా లండన్‌కు వెళ్లాక విరాట్‌ కొవిడ్‌ బారిన పడ్డాడని తెలిసింది.


'అవును, సెలవుల్లో మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లొచ్చాక విరాట్‌కు కొవిడ్‌ సోకింది. కానీ అతనిప్పుడు కోలుకున్నాడు' అని జట్టు వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్టు చేసింది. సోమవారమే కొందరు అభిమానులు అతడితో సెల్ఫీలు దిగిన సంగతి తెలిసిందే.


'కొవిడ్‌ వల్ల లీసెస్టర్‌షైర్‌లో జూన్‌ 24న జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌పై సందిగ్ధం నెలకొంది. ఈ మ్యాచ్‌ సాగాలని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బలంగా కోరుకుంటున్నాడు. వైరస్‌ సోకిన ఆటగాళ్లపై ఎక్కువ భారం వేయొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. జట్టులో మరిన్ని కేసులు ఉండొచ్చు' అని ఆ వర్గాలు తెలిపాయి.


కరోనా పరిస్థితులు టీమిండియాకు ఇబ్బందికర పరిణామమని భావిస్తున్న టైంలో రోహిత్‌ శర్మ, కోహ్లీ చేసిన పని బీసీసీఐకు ఆగ్రహం తెప్పింది. ఇంగ్లండ్ చేరుకున్న కొద్ది గంటల్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌లో తిరుగుతూ అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Also Read: మాస్క్‌లు మర్చిపోవద్దు- టీమిండియాకు బీసీసీఐ స్వీట్ వార్నింగ్


లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో భారత జట్టు సన్నాహక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న లండన్‌లోని లీసెస్టర్‌షైర్‌లో అభిమానులతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెల్ఫీలు తీసుకున్నారు. రోహిత్‌, విరాట్‌ మాస్క్‌లు ధరించకుండా షాపింగ్‌ చేశారనే వార్తలు కూడా వచ్చాయి.


ఇంగ్లండ్‌లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల మధ్య ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఇప్పుడు తక్షణ చర్య తీసుకోవాలని నిర్ణయించింది. అభిమానులను కలవొద్దని సూచించింది. మాస్క్‌లు లేకుండా బయటకు వెళ్లొద్దని ఆటగాళ్లను హెచ్చరించింది బోర్డు.