పసుపు పంట సాగుకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపును జిల్లాలో పండిస్తారు. దాదాపు 50 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. రాను రాను పసుపు సాగు తగ్గుతూ వస్తోంది. దీనిపై కారణాలు అన్వేషిస్తే... పసుపు రైతులకు పెట్టుబడి పెరగడం, పంటకు ఆశించిన ధర లభించడం లేదన్నది రైతులు చెబుతున్న మాట. అందుకే సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని రైతులు నిర్ణయించారు. ఇదే కోవలో అనేక మంది రైతులు పసుపు సాగు విస్తీర్ణాన్ని కుదిస్తున్నారు.
గతంలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా పసుపు సాగయ్యే జిల్లాగా నిజామాబాద్‌కు గుర్తింపు లభించింది. కానీ నాటి వైభవం ఇప్పుడు కనిపించడం లేదు. ఏటేటా పసుపు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతేడాది 35వేల ఎకరాల్లో సాగు కాగా ఈసారి మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. హెక్టార్లలో సాగు అయ్యే పంటను ఇప్పుడు ఎకరాలకు పరిమితం కానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
చాలా ఏళ్ల నుంచి ఒకే రకమైన విత్తనాలు ఉన్నాయి. కొత్త రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చి దిగుబడులతోపాటు కుర్కుమిన్ శాతం పెరిగేలా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. పసుపు పరిశోధన స్థానానికి 30 ఎకరాల భూమి ఉంది. అందులో విత్తనాలను ఉత్పత్తి చేసి పసుపు సాగు చేసే రైతులకు తక్కువ ధరకు అందిస్తే ఖర్చులు తగ్గుతాయనే వాదన వినిపిస్తుంది.
అందుబాటులోకిరాని స్పైసిస్ పార్క్
పసుపు రైతులకు బహుళ ప్రయోజనాలను కల్పించడానికి స్పైసిస్ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద భూసేకరణ చేపట్టి ప్రహరి నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసి వదలివేశారు. స్పైసిస్ పార్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తే రైతులు పసుపు ఇక్కడే విక్రయించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఇక్కడకు వచ్చి పసుపు కొనుగోళ్లు చేస్తే రైతులు కోరిన ధర లభించే అవకాశం ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.