ఇంగ్లండ్‌తో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్టు మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఇంగ్లండ్ వెళ్లలేకపోయాడు. ఇది కాస్త టీమిండియాకు ఇబ్బందికర పరిణామని భావిస్తున్న టైంలో రోహిత్‌ శర్మ, కోహ్లీ చేసిన పని బీసీసీఐకు ఆగ్రహం తెప్పింది. ఇంగ్లండ్ చేరుకున్న కొద్ది గంటల్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌లో తిరుగుతూ అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో భారత జట్టు సన్నాహక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న లండన్‌లోని లీసెస్టర్‌షైర్‌లో అభిమానులతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెల్ఫీలు తీసుకున్నారు. రోహిత్‌, విరాట్‌ మాస్క్‌లు ధరించకుండా షాపింగ్‌ చేశారనే వార్తలు కూడా వచ్చాయి.






ఇంగ్లండ్‌లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల మధ్య ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఇప్పుడు తక్షణ చర్య తీసుకోవాలని నిర్ణయించింది. అభిమానులను కలవొద్దని సూచించింది. మాస్క్‌లు లేకుండా బయటకు వెళ్లొద్దని ఆటగాళ్లను హెచ్చరించింది బోర్డు.
 
"యుకెలో కోవిడ్ ముప్పు తగ్గింది. అయితే ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండమని మేము జట్టును అడుగుతాము" అని బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమల్ అన్నారు.


యునైటెడ్ కింగ్‌డమ్‌లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది, దేశంలో ప్రతిరోజూ 10,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం 17 మంది టీమ్ ఇండియా సభ్యులు ఇంగ్లండ్ చేరుకున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన తర్వాత అశ్విన్‌ మాత్రం ఇంగ్లండ్‌ ఫ్లైట్‌ ఎక్కలేకపోయాడు. ఆయన త్వరగా కోలుకుని జులై 1-5 వరకు జరిగే ఐదో టెస్టుకు అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.