ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోందని కామెంట్ చేశారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్ అఫ్రిది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మార్కెట్ కారణంగానే అది ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తోందని అంగీకరించాడు. "అదంతా మార్కెట్, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది. అతిపెద్ద [క్రికెట్] మార్కెట్ భారత్‌. వారు ఏది చెబితే అది జరుగుతుంది" అని అఫ్రిదీ కామెంట్‌ చేసినట్టు సమా టీవీ ఉటంకించింది. 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇటీవలే ప్రకటించిన షెడ్యుల్‌పై మాట్లాడిన అఫ్రిది... క్రికెట్‌ను విస్తరించడానికి భారత్‌ ఏమైనా చేస్తుందన్నాడు. అలా చేయడానికి భారత్‌ సరిపోతుందని చెప్పాడు. ఐపీఎల్ సుదీర్ఘ టోర్నమెంట్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రభావం చూపబోతోందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం ఐపిఎల్ ఇండియన్ సబ్ కాంటినెంట్ టెలివిజన్ మీడియా హక్కులను డిస్నీ స్టార్ రూ. 23,575 కోట్లకు కైవశం చేసుకుంది. డిజిటల్‌ హక్కులను వయాకామ్ 18 మీడియా వేలంలో రూ. 23,758 కోట్ల బిడ్‌తో సొంతం చేసుకుంది. 


2023-2027 మీడియా హక్కులు వేలంలో 410 మ్యాచ్‌లకు రూ. 48,390 కోట్లకు అమ్ముడయ్యాయి.  సెప్టెంబర్ 2017లో స్టార్ ఇండియా టీవీ, డిజిటల్ రెండింటికీ రూ. 16,347.50 కోట్లు చెల్లించింది. ఇప్పుడు వాటిని 170 శాతం లేదా 2.7 రెట్లు ఎక్కువకు అమ్ముడుపోయాయి. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పుడు రెండవ అత్యంత విలువైన క్రీడా ఈవెంట్ మారింది. 


ఈ బిడ్డింగ్‌తో ఐపీఎల్‌ టోర్నీలపై స్పందించిన జే షా... ఐపీఎల్‌కి అధికారికంగా రెండున్నర నెలల విండో ఉంటుందని చెప్పారు. దీని వల్ల అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లందరూ పాల్గొనే ఛాన్స్‌ ఉందని వివరించాు. దీని కోసం వివిధ బోర్డులతోపాటు ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు షా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


ఈ కామెంట్స్‌పైనే స్పందించిన షాహిద్ అఫ్రిదీ... ఇది ప్రపంచ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా... క్రికెట్‌ విషయంలో భారత్‌ ఏమనుకుంటే అదే జరుగుతుందన్నారు.