రోడ్లన్నీ జలయం, పడవలే దిక్కు 


అసోంలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరదలతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, స్థానికులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. కచార్ జిల్లాలోని సిల్చార్‌ పట్టణ ప్రజలు పడవల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలు..వాళ్ల కష్టాలను కళ్లకు కట్టాయి. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవటం వల్ల సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేందుకు పడవలే దిక్కయ్యాయి. ఇక్కడే కాదు. కచార్‌ జిల్లాలోని పలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది. పూర్తిగా నీట మునిగిపోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 


కొనసాగుతున్న సహాయక చర్యలు 


సైన్యంతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF,బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF,నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్-NDRF,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. సోమవారం దాదాపు మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. సిల్చార్‌లోనే రకరకాల ప్రాంతాలకు చెందిన వారిని ఒక్కచోటకు చేర్చుతూ రక్షిస్తున్నాయి సహాయక బృందాలు. పీటీఐ లెక్కల ప్రకారం...అసోంలో వరదల కారణంగా ఇప్పటికే 82 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది గత 24 గంటల్లోనే మరణించినట్టు తెలుస్తోంది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. ఈ బాధితుల్లో కచార్, కరీమ్‌గంజ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కచార్‌ టౌన్‌లోనే దాదాపు 2 లక్షల మందికిపైగా వరదల ధాటికి విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 36 జిల్లాలుండగా దాదాపు 32 జిల్లాలు వరద ప్రభావిత ప్రాంతాలే.





 


విద్యా సంస్థలు బంద్ 


అటు కరీమ్‌గంజ్‌ జిల్లాలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. కుషియారా, లాన్‌గాయ్, సింగల ప్రాంతాల్లోని నదులు ఉప్పొంగి ఊళ్లను ముంచేశాయి. దాదాపు లక్షా 30 వేల మంది ప్రభావితమైనట్టు తెలుస్తోంది. వరదల కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్ని మూసివేశారు. బ్రహ్మపుత్ర, కొపిలి నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతున్నాయి. 5,424 గ్రామాల్లోని125 రెవన్యూ సర్కిళ్లలో వరద ప్రభావం అధికంగా ఉంది. 810 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి లక్షలాది మందిని తరలిస్తున్నారు. బర్పెట, కచార్, దరాంగ్, గోల్‌పర కమ్‌రుప్ పట్టణ ప్రాంతాల్లో వరద తాకిడి ఎక్కువగా ఉంది. 349 రోడ్లు, 16వంతెనలు ధ్వంసమైనట్టు అధికారులు స్పష్టం చేశారు. లక్ష హెక్టార్లకుపైగా పంట పొలాలు దెబ్బ తిన్నాయి. లక్షలాది జంతువులు వరదల ధాటికి బిక్కుబిక్కుమంటున్నాయి.