Viral News: బృందంగా ఆడే క్రికెట్, ఫుట్‌బాల్ వంటి గేమ్స్‌లో ఆటగాళ్లను నియంత్రించడంతో పాటు నిబంధనలను పాటిస్తూ ఆటను సక్రమంగా నడపడంలో మ్యాచ్ రిఫరీ (క్రికెట్‌లో అయితే అంపైర్లు)లది కీలకపాత్ర. క్రికెట్‌తో పోల్చితే ఫీల్డ్‌లో ఇంకాస్త ఎక్కువ మంది ఉండి గోలగోలగా ఉండే ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లను అదుపుచేయడం, వారితో కలిసి పరుగెత్తడం వంటివి కష్టంతో కూడుకున్నవి. అందుకే వీటిలో ఫుల్ ఫిట్‌గా ఉండి అంతర్జాతీయ స్థాయిలో అనుభవమున్నవారినే ఎక్కువగా రిఫరీలుగా పెడుతుంటారు. కానీ బొలివియాలో పదేండ్ల బాలుడు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడి కథా కమామీషు ఇది..
బొలివియాలోని ఎల్ ఆల్టో నగరానికి చెందిన ఎరిక్ కలేజాస్ వయసు పదేండ్లు. కానీ అతడు ఇప్పటికే స్థానికంగా జరిగే పలు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు రిఫరీగా కూడా పనిచేశాడు. కలేజాస్ తండ్రి రమైరో కూడా రిఫరీగానే రాణిస్తున్నారు. చిన్నప్పట్నుంచి నాన్నను చూస్తూ ఆట గురించి అవగాహన పెంచుకున్న కొడుకు కలేజాస్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు.
వారంలో శని, ఆది వారాల్లో లోకల్‌గా జరిగే టోర్నీలకు రిఫరీగా వ్యవహరిస్తూ మిగిలిన రోజుల్లో స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నాడు కలేజాస్. చిన్ననాటి నుంచే తండ్రి దగ్గర రిఫరీ చేసేందుకు కావాల్సిన లక్షణాలను వంటబట్టించుకున్న కలేజాస్.. తండ్రితో పాటు కలిసి మ్యాచ్‌లలో రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. ఇదే విషయమై అతడి తండ్రి రమైరో మాట్లాడుతూ.. ‘చిన్ననాటి నుంచే కలేజాస్‌కు రిఫరీ అంటే ఇష్టంగా ఉండేది. అతడి ఆసక్తిని గమనించి ఆటకు సంబంధించిన నియమాలు, నిబంధనాలు నేర్పించాను. ప్రతి శనివారం, ఆదివారం నేను నా లిటిల్ కొలీగ్ (కలేజాస్)తో కలిసి స్థానికంగా జరిగే మ్యాచ్‌లకు రిఫరీ చేస్తుంటాం. నా కొడుకుతో కలిసి మ్యాచ్‌కు రిఫరీగా ఉండటం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. నా కొడుకుకు రిఫరీ లక్షణాలు వాడి రక్తంలో ప్రవహిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది..’అని చెప్పాడు.
కలేజాస్ రిఫరీ గురించి అక్కడి ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. బొలివియా ఆటగాడు బీమర్ టంకర స్పందిస్తూ ‘అతడిలో రిఫరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతడు మాతో కలిసి పరిగెడతాడు. మమ్మల్ని హెచ్చరిస్తాడు. మ్యాచ్‌లు జరిగేప్పుడు ప్రజల అరుపులు, అల్లర్లను పట్టించుకోకుండా గేమ్ మీదే ఫోకస్ చేస్తాడు. నాకు తెలిసి అతడు రిఫరీ అవడానికే పుట్టినట్టున్నాడు. చాలా టాలెంటెడ్. అతడి రిఫరీ నాకు చాలా ఇష్టం’ అని తెలిపాడు.
ప్రస్తుతం కలేజాస్.. స్థానికంగా జరిగే కమ్యూనిటీ లీగ్‌లో రిఫరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ తనకు మాత్రం ఫిఫా వరల్డ్ కప్, కోపా అమెరికా కప్ వంటి పెద్ద టోర్నీలకు రిఫరీగా ఉండాలని ఉందని అంటున్నాడు. ‘బొలివియా ఆడే మ్యాచ్‌లతో పాటు ఫిఫా వరల్డ్ కప్‌లో రిఫరీగా ఉండటం నా కల. అమెరికా కప్, లిబరేషన్స్ కప్, ఛాంపియన్స్ లీగ్‌లో కూడా నేను రిఫరీగా చేయాలనుకుంటున్నాను’అని కలేజాస్ చెప్పాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial