ఈ ఏడాది జూన్ , జులై నెలలో రికార్డు అయిన ఉష్ణోగ్రతలు అత్యధికమైనవని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. అమెరికాలోని దక్షిణ ప్రాంతాలతోపాటు దక్షిణ యూరోప్‌లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొన్ని చోట్ల కార్చిచ్చులు, మరికొన్ని చోట్లు హీట్‌ వేవ్‌ లు, మరికొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం వ్యాపిస్తోంది. 


ఇది కేవలం నేలపై మాత్రమే కాదు, ప్రస్తుతం సముద్రంలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని రీతిగా జూన్‌ లో సముద్రాల్లోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. మరోవైపు అంచనా వేసే ఉష్ణోగ్రతలు, వాస్తవానికి మధ్య తేడా కూడా జూన్‌లో చాలా ఎక్కువగా నమోదైందని నేషనల్ ఆఫీస్ ఆఫ్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) తెలిపింది.


మే నెలలోనూ అమెరికా, కెనడాల పశ్చిమ తీరంలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి ప్రస్తుతం ఫ్లోరిడా పరిసరాల్లోని జలాలు చాలా వేడెక్కుతున్నాయి. పశ్చిమ మధ్యధరా సముద్రంలో, ముఖ్యంగా జిబ్రాల్టార్ జల సంధికి సమీపంలో ఒక హీట్‌వేవ్ తీవ్రం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈశాన్య అట్లాంటిక్‌లో హీట్‌వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది అని ఎన్‌జీవో మెర్కటర్ ఓషన్ ఇంటర్నేషనల్ తెలిపింది.


మరోవైపు న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇర్లాండ్, బ్రిటన్‌ల తీరాలతోపాటు బాల్టిక్ సముద్రంలోనూ విపరీత ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.‘‘భిన్న ప్రాంతాల్లోని సముద్రాల్లో తీవ్రమైన హీట్‌వేవ్‌లు కనిపిస్తున్నాయి. ఇవి చాలా తీవ్రంగా ఉండటంతోపాటు చాలా ఎక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దక్షిణ గ్రీన్‌లాండ్‌లోని లాబ్రడార్ సముద్రంలోనూ ఒక హీట్‌వేవ్ విజృంభించే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 


ఎల్‌నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉండబోతోందని శాస్త్రవేత్తలు ముందుగానే అంచనా వేశారని యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ కార్లో బౌంటెంపో చెప్పారు.ప్రాంతీయ సముద్ర, వాతావరణంలో చోటుచేసుకునే కొన్ని మార్పులతో తీవ్రమైన హీట్‌వేవ్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. 


ఇలా కొన్ని వారాలు పాటు కొనసాగే అవకాశముంది. దీర్ఘకాలం ఇలా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. ఉష్ణంలో 90 శాతం సముద్రాల్లోకి వెళ్తుంది. సముద్రంలో హీట్‌వేవ్స్ పెరగడానికి వాతావరణంలోని ఏరోసోల్ స్థాయిలు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. వీటి వల్ల చుట్టుపక్కల కాస్త చల్లగా ఉంటుంది. 


ఇటీవల సహారా ప్రాంతం నుంచి దుమ్ముతో కూడిన గాలి కూడా రావడం తగ్గిపోయింది. నిజానికి ఇది కాస్త చల్లదనాన్ని ఇస్తుంది.
ప్రస్తుత హీట్‌వేవ్‌లు మరింత తీవ్రంగా కూడా కావచ్చు. ఈ హీట్‌వేవ్‌ల వల్ల సముద్రపు జీవులు, చేపలు, వాతావరణం తీవ్రంగా ప్రభావితం కావొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.


ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 2010/2011ల్లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇక్కడి కెల్ప్ అడవులు కూడా ధ్వంసమయ్యాయి. ఫలితంగా ఇక్కడ పర్యావరణ వ్యవస్థ చాలా దెబ్బతింది. మెరైన్ హీట్‌వేవ్‌ల వల్ల క్లోరల్ బ్లీచింగ్ అంటే పగడపు దిబ్బల్లోని జీవులు మరణించొచ్చు. 


మధ్యధరా సముద్రంలో 2015 నుంచి 2019 మధ్య నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వల్ల కోరల్స్, ఆల్గే లాంటి జీవులు పెద్దయెత్తున మరణించాయి.మెరైన్ హీట్‌వేవ్‌లతో కొత్తరకం జాతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా పెరిగే ఉష్ణోగ్రతలు అక్కడి జీవులకు ఎక్కువ సమయం ఇవ్వవు. ఫలితంగా వాటి మనుగడకే ముప్పు ఉండొచ్చు’’అని నిపుణులు చెబుతున్నారు.


అయితే, నేలపై వచ్చే హీట్‌వేవ్స్‌తో పోల్చినప్పుడు సముద్రంలోని హీట్‌వేవ్స్‌పై మనకు అందుబాటులో ఉండే సమాచారం చాలా తక్కువ. కాబట్టి వీటిని పరిశీలించడం కొంచెం కష్టమని నిపుణులు అంటున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనేందుకు కూడా ఒక్కోసారి ఉత్తర అట్లాంటిక్ కారణం అవుతుంది. ఇక్కడ సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో హరీకేన్లు ఎక్కువగా రావచ్చు. ప్రస్తుత ఎల్‌నినోతో ఇక్కడ ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియాల్సి ఉంది.


మరోవైపు ఉత్తర అట్లాంటిక్‌లో జలాలు వేడెక్కడంతో మధ్య ఆఫ్రికాలో కరవు, భారీ వర్షాల పడే క్రమం కూడా నియంత్రణ తప్పే అవకాశం ఉంటుంది.నేలపై హీట్‌వేవ్‌ల ద్వారా హిమానీనదాలు అసాధారణ రీతిలో కరగడం తరహాలోనే సముద్రంలోనూ వీటితో విధ్వంసకర మార్పులు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.