Ozempic: ఓజెంపిక్..ఈ పేరు గత కొద్ది నెలలుగా వైరల్ అవుతోంది. అసలు ఓజెంపిక్ ఏంటి. దాని పని ఏంటో తెలుసుకుందాం. ఓజెంపిక్ వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ ప్రభావం తగ్గించగల ఇంజెక్టెడ్ మెడిసిన్. దీనిని వారానికి ఒక సారి వేసుకుంటారు. మెట్‌ఫార్మిన్‌ను తీసుకోలేనివారి దీనిని సొంతంగా ఉపయోగించుకోవచ్చు. ఒక పరిశోధనలో దాదాపు మూడు వంతుల మంది దీనిని వాడటం ద్వారా తమ శరీర బరువులో 10 శాతానికి పైగా తగ్గారని తేలడంతోపాటు అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అయినప్పటికీ అధిక బరువు తగ్గేంచే అద్భుత మైన ఔషధంగా జనాదరణ పొందింది.
ఓ టీవీ షోలో షారన్ ఓస్బోర్న్ బరువు తగ్గడానికి ఉపయోగించే టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ అయిన ఓజెంపిక్ గురించి మాట్లాడారు. ఈ మందు పొట్టను తగ్గిస్తుందని, తరువాత ‘మిమ్మల్ని మారుస్తుంది’ అని ఆమె చెప్పింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న పెద్దలకు ఇది ఒక ఔషధం. ఇది ఆహారం, వ్యాయామంతో పాటు రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది. ఓజెంపిక్ బరువు తగ్గడానికి ఉద్దేశించినది కానప్పటికీ, ఇది కొంత బరువు తగ్గడానికి ప్రజలకు సహాయపడొచ్చని, ఓజెంపిక్ అనేది వారానికోసారి ఇంజెక్ట్ చేయగల మందు అని, అయితే ఇది అద్భుత ఔషధం కాదని నిపుణులు అంటున్నారు.
ఓజెంపిక్ అనేది డానిష్ ఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నార్డిస్క్ తయారు చేసిన యాంటీ డయాబెటిక్ డ్రగ్, ఇది ఇంజెక్ట్ చేయగల మెడిసిన్. మొదట్లో టైప్ 2 డయాబెటిస్ బాధితుల ట్రీట్‌మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా దీనిని వినియోగించారు. ఈ ఔషధం శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆకలి తగ్గించేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. 2021 ప్రారంభంలో ఓజెంపిక్ ఔషధాన్ని ఉపయోగించిన దాదాపు మూడు వంతుల మంది తమ శరీర బరువులో 10 శాతానికిపైగా కోల్పోయిన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రీడ్ ప్రివ్యూ రీసెర్చ్ సంస్థ పరిశోధకులు కూడా అది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొనడంతో ఓజెంపిక్ వాడకం దారి తప్పింది. డయాబెటిస్ పేషెంట్లు మాత్రమే కాకుండా అధిక బరువు ఉన్నవారు వాడటం ప్రారంభించారు.
ఫోర్బ్స్ ఓజెంపిక్ ఔషధంపై వివరణాత్మక కథనం ప్రచురించింది. ఓజెంపిక్ అనేది గ్లూకోగాన్ లాంటి పెప్టైడ్-1 (GLP-1) రిసెప్టర్ అగోనిస్ అని పేర్కొంది. ఇది శరీరం అంతటా GLP-1 గ్రాహకాలను యాక్టివేట్ చేయడం, వాటి ప్రభావాలను మెరుగుపరచడంపై పనిచేస్తుందని తెలిపింది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన క్రిస్టోఫర్ మెక్‌గోవన్ దీని గురించి మాట్లాడుతూ. ఓజెంపిక్ మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుందని, అలాగే కడుపు ఖాళీ అయ్యే రేటును తగ్గించడం ద్వారా బరువును ప్రభావితం చేస్తుందని చెప్పారు.
మొదటగా USలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2017లో డయాబెటీస్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేయదగినదిగా ఈ మందులను మొదట ఆమోదించింది. తర్వాత, 2021లో ఊబకాయం చికిత్సకు ఓజెంపిక్ అధిక మోతాదుతో కూడిన ఔషధం ఆమోదించబడింది. అప్పటి నుంచి, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అక్టోబర్ 2022లో ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటని అడిగినప్పుడు వైగోవి బ్రాండ్ పేరుతో విక్రయించే ఓజెంపిక్ కలిగిన డ్రగ్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ప్రముఖ నటీనటులు, నిర్మాతలు ఈ డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నట్లు ఒక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. దీనిపై యుఎస్‌కు చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ దిశా నారంగ్ దీనిపై స్పందిస్తూ.. ఓజెంపిక్‌పై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. ఆ మందును సూచించే వైద్యులను కనుగొనడం ప్రారంభించారు. అలాగే ఆన్‌లైన్‌లో ఓజెంపిక్ వెతకడం ప్రారంభించారని అన్నారు.