Vinesh Phogat Injury: 


రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ను దురదృష్టం వెంటాడింది! కీలకమైన ఆసియా క్రీడలకు ముందు ఆమె గాయపడింది. శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకుంది.


కొన్నాళ్ల క్రితం బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో వినేశ్ ఫొగాట్‌ది కీలక పాత్ర. ఆయన మీద లైంగిక ఆరోపణలు చేసింది. కొందరు రెజ్లర్లతో కలిసి జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలు చేపట్టింది. కోర్టు జోక్యం చేసుకోవడం, హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడిన తర్వాత ఈ ఆందోళనలను విరమించారు. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా వీరిని హాంగ్జౌకు పంపించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పందంగా మారింది.


భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ తాత్కాలిక కమిటీ వినేశ్ ఫొగాట్‌, బజరంగ్‌ పునియాను ట్రయల్స్‌తో సంబంధం లేకుండా ఆసియా క్రీడలకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పంగాల్‌, సుజిత్‌  కల్‌కాల్‌ కోర్టుకు వెళ్లగా.. హైకోర్టు వీరి పిటిషన్‌ను తిరస్కరించింది. 53 కిలోల ట్రయల్‌ను పంగాల్‌ గెలవగా, 65 కిలోల విభాగంలో విశాల్‌ గెలిచాడు. కానీ వీరిని కమిటీ రిజర్వు ప్లేయర్లుగా పంపిస్తోంది.


'నేను మీతో ఓ బాధాకరమైన వార్తను పంచుకుంటున్నాను. 2023, ఆగస్టు 13న ప్రాక్టీస్‌ చేస్తుండగా నా మోకాలు గాయపడింది. స్కానింగ్‌, పరీక్షలు నిర్వహించాక శస్త్రచికిత్స చేయడమే మార్గమని వైద్యులు తెలిపారు. ఆగస్టు 17న ముంబయిలో నేను శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో నేను పతకం సాధించాను. మళ్లీ దానిని రీటెయిన్‌ చేసుకోవాలన్నది నా లక్ష్యం. దురదృష్టవశాత్తు గాయపడటంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను' అని వినేశ్ ఫొగాట్‌ ఎక్స్‌ వేదికగా తెలిపింది.


పంగాల్‌, కాళీరామన్‌ను భారత జట్టులో చేర్చడాన్ని కాప్‌ పంచాయతీ అంగీకరించింది. హరియాణాలోని సిసాయిలో జరిగిన సమావేశంలో వీరు అనుకూలంగా మాట్లాడారు. కాగా రిజర్వు ప్లేయర్‌ను ఆసియా క్రీడలకు పంపించాలని అధికారులకు తెలియజేశానని వినేశ్‌ వెల్లడించింది. అండర్‌ 20 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం 19 ఏళ్ల పంగాల్‌ జోర్డాన్‌కు వెళ్లింది. ఇప్పుడు మహిళల 53 కిలోల విభాగంలో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది.


'అభిమానులు నాకు ఇలాగే అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడే నేను ఘనంగా పునరాగమనం చేస్తాను. 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు త్వరగా సన్నద్ధం అవుతాను. మీ మద్దతు నాకెంతో బలం ఇస్తుంది' అని వినేశ్‌ పేర్కొంది. ఇక బజరంగ్‌ పునియా సోనెపత్‌లోని నేవీ రాయపుర్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడని తెలిసింది.


Also Read: టీమ్‌ఇండియా నంబర్‌ 4.. విరాట్‌ కోహ్లీ!