మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే చేయకుండా విభిన్నమైన కథలను ఎంచుకోవడంతోపాటు సరికొత్త ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే 'గాండీవదారి అర్జున' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మెగా ప్రిన్స్. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ మేరకు వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "మంచి సినిమా ఇవ్వాలనే ప్రెజర్, జనాలను ఎంటర్టైన్ చేయాలని ప్రతి యాక్టర్ కి ఉంటుంది. నా వరకు ఫ్యామిలీ ప్రెజర్ అనేది ఎక్కడా లేదు. ఒక యాక్టర్ గా అలాంటి సినిమాలు చేయొద్దు, ఇలాంటి సినిమాలు చేయొద్దు.. అని నన్ను నేను పరిమితం చేసుకోవడం కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. ఇప్పటివరకు అయితే నేను మంచి సినిమాలే తీశానని అనుకుంటున్నాను. అది హిట్ అయినా ప్లాప్ అయినా. మా అన్నయ్య చరణ్ కూడా నేను ఏడవ సినిమా చేస్తున్న సమయంలో నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు. ఈ సమయంలో నీకు నచ్చిన సినిమా, నీకు కరెక్ట్ గా అనిపించిన సినిమా, నువ్వు నమ్మిన సినిమా నువ్వు చేసుకుంటూ ఉండని తెలిపాడు" అన్నారు.
"ఫ్యూచర్ లో నీకు బిజినెస్ తో పాటు మార్కెట్ పెరుగుతుంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వస్తారు. కానీ ఎక్కడో చోట నిన్ను ఇలాంటి సినిమానే చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం అలాంటి ట్రాప్ లో పడొద్దు. ఒకానొక సమయంలో నాకు కొన్ని కథలు చేయాలని అనిపించినా, పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నానని, కానీ నీకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని, నీకు నచ్చిన కథలు సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్, డిఫరెంట్ సినిమాలు చేయమని చరణ్ అన్న చెప్పారు. బహుశా మా ఫ్యామిలీ మొత్తంలో ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదు. చరణ్ అన్న నాతో ఇది చెప్పారు" అని తెలిపారు వరుణ్ తేజ్. దీంతో రామ్ చరణ్ గురించి వరుణ్ తేజ్ చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక కెరియర్ పరంగా వరుణ్ తేజ్ తన గత సినిమా 'గని' తో భారీ డిజాస్టర్ అందుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాగానే కష్టపడ్డాడు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. దీంతో ఎలాగైనా ఈసారి 'గాండీవ దారి అర్జున' సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఎందుకంటే ఈ డైరెక్టర్ గత చిత్రం 'ది ఘోస్ట్' భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే ప్రవీణ్ సత్తారుకి దర్శకుడిగా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read : ‘పార్ట్‌నర్’ తెలుగు ట్రైలర్ - హన్సికగా మారిపోయిన యోగిబాబు, కామెడీ అదుర్స్