Virat Kohli:
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) నాలుగో స్థానంలో ఆడాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సూచిస్తున్నాడు. ఆ స్థానంలో అతడి గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పాడు. ఆట ఎదిగే కొద్దీ ఆటగాళ్లూ మారాలని వెల్లడించాడు. 2019 ప్రపంచకప్‌లోనూ తాను ఈ మార్పు గురించి ఆలోచించానని వివరించాడు. స్టార్ స్పోర్ట్స్‌కు వచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి మాట్లాడాడు.
విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిస్తే హెవీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్‌ను విభజించొచ్చని రవిశాస్త్రి (Ravi Shastri) అంటున్నాడు. దాంతో కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో బ్యాటింగ్ యూనిట్ సమతూకం అవుతుందన్నాడు. 'ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు రావాలి. ఒక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఎంతో అనుభవం ఉంది. అతడు మూడో స్థానంలో రావొచ్చు. అవసరాన్ని బట్టి నాలుగో ప్లేస్‌కు రావాలి. ఇక్కడే మనకు ఆటగాళ్ల మానసిక స్థితి అర్థమవుతుంది. టాప్ ఆర్డర్లో కాకుండా 3, 4 పొజిషన్లో ఆడాలంటే శుభ్‌మన్ గిల్ ఎలా ఫీలవుతాడు? ఎవరికీ ఏ స్థానమూ సొంతం కాదు. అవసరమైతే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో రావాలి. జట్టు కోసం తప్పదు' అని శాస్త్రి అన్నాడు.
టీమ్‌ఇండియాకు కోచ్‌గా ఉన్నప్పుడే విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించడంపై ఆలోచించానని రవిశాస్త్రి తెలిపాడు. 'చివరి రెండు ప్రపంచకప్‌లలో విరాట్‌ను నాలుగో స్థానంలో ఆడించడంపై ఆలోచించాను. టాప్ హెవీ బ్యాటింగ్ లైనప్‌ను బ్రేక్ చేసేందుకు అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో మాట్లాడాను. ఎందుకంటే టాప్ ఆర్డర్లో 2, 3 వికెట్లు పడ్డాయంటే మన పని అయిపోతోంది. ఇది ఎన్నోసార్లు నిరూపితం అయింది. అందుకే టాప్ ఆర్డర్‌ను విభజించడం ముఖ్యం' అని పేర్కొన్నాడు.
'ఒకసారి నంబర్ 4లో విరాట్ కోహ్లీ గణాంకాలు చూడండి. చాలా బాగుంటాయి' అని శాస్త్రి అన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కింగ్ కోహ్లీకి తిరుగులేదు. 275 వన్డేల్లో 57.32 సగటుతో 12,898 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 93గా ఉంది. 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కొన్నేళ్లుగా అతడు మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. 210 ఇన్నింగ్సుల్లో ఈ స్థానంలో ఆడి 60.20 సగటుతో 10,777 పరుగులు చేశాడు. 39 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు బాదేశాడు. నాలుగో స్థానంలో 39 ఇన్నింగ్సుల్లో 55.21 సగటుతో 1767 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు బాదాడు.
'ఎంత పెద్ద ఆటగాడైనా ఆటతో పాటూ తనూ మారాలి. విరాట్ కోహ్లీకీ ఇదే వర్తిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఒకసారి ప్రపంచ క్రికెట్‌ను చూడండి. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ ఇలాగే చేస్తున్నారు. ఆటకు తగ్గట్టుగా మారుతున్నారు. క్రికెట్లో సృజన పెరుగుతోంది. క్రికెటర్లు దానిని అందిపుచ్చుకుంటున్నారు' అని రవిశాస్త్రి అన్నాడు.
ఈ ఏడాది విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 10 వన్డేల్లో 53.37 సగటుతో 427 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. శ్రీలంకపై 166తో విజృంభించాడు. అన్ని ఫార్మాట్లలో 17 మ్యాచులు ఆడి 54.66 సగటుతో 984 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: కమ్‌బ్యాక్‌కి ముందే బుమ్రా రికార్డు! టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మొదటి బౌలర్ అతడే!