England WC 2023 Squad: 2023 ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును బుధవారం ప్రకటించింది. ఇందులో బెన్ స్టోక్స్ కూడా చేరడం విశేషం. 2022లో బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ నుంచి తిరిగి రానున్నాడు. వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా టెస్టులు మాత్రం స్టోక్స్ ఆడుతూనే ఉన్నాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా మంచి ఆటతీరును కనపరిచాడు. తన వరల్డ్ కప్ జట్టులోకి తిరిగి రావడం ఇంగ్లండ్‌కు చాలా పెద్ద ప్లస్ పాయింట్. 2019 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ గెలవడం వెనక బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు.


అయితే ఈ ప్రపంచకప్‌కు శాశ్వత జట్టును ఇంగ్లాండ్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ప్రకటించిన తాత్కాలిక జట్టులో  పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అభిమానులకు తెలియజేసింది.


ఇంగ్లండ్ ప్రకటించిన ప్రస్తుత తాత్కాలిక జట్టులో 15 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్‌లను చేర్చలేదు. జోఫ్రా ఆర్చర్ ప్రపంచకప్‌లో ఆడలేకపోవచ్చు. గాయం తర్వాత అతను పూర్తిగా ఫిట్‌గా ఉండలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే జట్టులో భాగమవుతాడని ఇంగ్లండ్ సెలెక్టర్ లూక్ రైట్ తెలిపారు.


బెన్ స్టోక్స్ గురించి లూక్ రైట్ మాట్లాడుతూ, "జట్టు చాలా సమతుల్యంగా ఉంది. బెన్ స్టోక్స్ పునరాగమనం జట్టులో నాణ్యతను పెంచుతుంది. అతనికి మ్యాచ్‌లు గెలిపించగల సామర్థ్యం ఉంది. అతను నాయకత్వంలో కూడా ముందున్నాడు. అభిమానులు బెన్ స్టోక్స్ పునరాగమనాన్ని ఆనందిస్తారని నేను భావిస్తున్నాను." అన్నాడు.


2023 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లను ఇంగ్లండ్ ఇంకా అధికారికంగా ఐసీసీకి సమర్పించలేదు. అయితే త్వరలో ఇంగ్లండ్ బోర్డు ఇదే జట్టును ఐసీసీకి సమర్పించే అవకాశం ఉంది.


ఇంగ్లాండ్ తాత్కాలిక ప్రపంచకప్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, శామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్ , క్రిస్ వోక్స్


వీరిలో చాలా మందికి భారత దేశంలో పిచ్‌లపై ఆడిన అలవాటు ఉంది. జోస్ బట్లర్, మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, శామ్ కరన్, లియాం లివింగ్‌స్టోన్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ వీరందరికీ భారత పిచ్‌లు కొట్టిన పిండి. ఐపీఎల్ 2023 సీజన్‌లో వీరంతా మెరుగైన ఆటతీరును కనబరించారు కూడా. కాబట్టి ఈ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేస్తే ఎదురు దెబ్బ బలంగా తగిలే అవకాశం ఉంది. 






Also Read: భారత్‌ vs ఐర్లాండ్‌ టీ20 సమరం - ఈ యాప్‌లో ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌!