IPL Media Rights: ఐపీఎల్‌ మీడియా హక్కులను రెండు కంపెనీలు గెలుచుకున్నాయని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. భారత్‌లో టీవీ ప్రసార హక్కులను రూ.23,575 కోట్లు వెచ్చించి స్టార్‌ ఇండియా గెలిచిందని ప్రకటించారు. డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ 18 రూ.23,758 కోట్లు పెట్టి సొంతం చేసుకుందన్నారు. వేలానికి సంబంధించిన వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.




'రూ.23,758 కోట్లతో వయాకామ్‌ 18 డిజిటల్‌ హక్కులను కొనుగోలు చేసింది. భారత డిజిటల్‌ విప్లవం గురించి అందరికీ తెలిసిందే. ఈ రంగంలో అపరిమితంగా అభివృద్ధికి ఆస్కారం ఉంది. క్రికెట్‌ను వీక్షిస్తున్న విధానాన్ని డిజిటల్‌ మీడియం పూర్తిగా మార్చేసింది. క్రికెట్‌ అభివృద్ధి, డిజిటల్‌ ఇండియా దార్శనికతకు ఇదో కారణం' అని జే షా ట్వీట్‌ చేశారు.


'ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ హక్కులను గెలిచినందుకు వయాకామ్‌కు అభినందనలు. మిడిల్‌ ఈస్ట్‌, నార్త్‌ అమెరికా, అమెరికా, రెస్టాఫ్‌ ద వరల్డ్‌ హక్కులు గెలిచిన టైమ్స్‌ ఇంటర్నెట్‌కు కంగ్రాచ్యులేషన్స్‌. భారత ఆవల సైతం ఐపీఎల్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ క్లాస్‌ క్రికెట్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు' అని మరో ట్వీట్‌లో షా వివరించారు.




'ఐపీఎల్‌ మీడియా హక్కులపై చాలా మంది బిడ్లర్లు ఆసక్తి చూపించారు. వారి పెట్టుబడులకు వాస్తవ విలువను రాబట్టేందుకు బీసీసీఐ అన్ని విధాలా కృషి చేస్తుంది. ఐపీఎల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి బీసీసీఐ వినియోగిస్తుంది. గ్రామీణ స్థాయిలోనూ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. క్రికెట్‌ వీక్షించే అనుభవాన్ని మార్చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర సంఘాలు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చేసింది. అభిమానులు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో క్రికెట్‌ వీక్షణను ఎంజాయ్‌ చేసేలా చూడాలి' అని జే షా వరుస ట్వీట్లు చేశారు.