US Open 2023: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ - 2023లో సెర్బియా స్టార్ నొవాక్ జకొవిచ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. కెరీర్‌లో 24వ గ్రాండ్ స్లామ్ సాధించాలనే పట్టుదలతో యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన జకోవిచ్.. 6-1, 6-4, 6-4 తేడాతో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించాడు. ఈ క్రమంలో జకోవిచ్.. స్విస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ రికార్డును బ్రేక్ చేశాడు. జకోకు ఇది 47వ సెమీస్ కాగా ఫెదరర్.. గతంలో 46 సార్లు గ్రాండ్ స్లామ్ సెమీస్‌లు ఆడాడు.
పురుషుల గ్రాండ్ స్లామ్ చరిత్రలో 23 టైటిళ్లు నెగ్గి కొద్దిరోజుల క్రితమే ముగిసిన వింబూల్డన్ టోర్నీలో స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడి నిరాశకు గురైన జకో.. తనకు అచ్చొచ్చిన యూఎస్ ఓపెన్‌లో మాత్రం రెచ్చిపోతున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో కాస్త శ్రమించినా ఫెదరర్.. సెమీస్ లో మాత్రం పెద్దగా పోటీ లేకుండానే సెమీస్‌కు చేరాడు. వరుసగా మూడు సెట్లలోనూ ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఈ విజయం ద్వారా జకో.. యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్ల మీద సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించాడు. యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్ల మీద జకో రికార్డు 12-0గా ఉంది.
ఇక పురుషుల గ్రాండ్ స్లామ్ టోర్నీలలో అత్యధికసార్లు సెమీస్ చేరిన ఆటగాడిగా గతంలో ఫెదరర్ పేరిట రికార్డు (46) ఉండేది. కానీ తాజాగా జకో దానిని అధిగమించాడు. ఫ్రిట్జ్‌ను ఓడించడంతో జకో ఈ ఘనత అందుకున్నాడు. అంతేగాక ఈ రెండో సీడ్ ఆటగాడికి ఇది 13వ యూఎస్ సెమీస్. టెన్నిస్‌లో అత్యధిక సార్లు సెమీఫైనల్ చేరిన ఘనత అమెరికా టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఉంది. తన కెరీర్‌లో 18 మేజర్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆమె.. ఏకంగా 52 సార్లు సెమీఫైనల్స్ ఆడింది. ఈ జాబితాలో ఎవర్ట్ (52), జకోవిచ్ (47), ఫెదరర్ (46) తర్వాత మార్టినా నవ్రతిలోవా (44), సెరెనా విలియమ్స్ (40), రఫెల్ నాదల్ (38), స్టెఫీ గ్రాఫ్ (37) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
సెమీస్ బెర్తులు సాధించింది వీళ్లే..
అమెరికాకు చెందిన బెన్ షెల్టన్.. 6-2, 3-6, 7-6 (9-7) తేడాతో తన దేశానికే చెందిన తియోఫెపై గెలిచి సెమీస్ చేరాడు. తద్వారా అతడు 1992 తర్వాత యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరిన అగ్రరాజ్యానికి చెందిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. మరో క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్.. 6-3, 6-2, 6-4 తేడాతో జర్మనీకి చెందిన అలగ్జాండెర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. సెమీస్‌లో బెన్ షెల్టన్.. జకోవిచ్‌ను ఢీకొననుండగా.. మరో సెమీఫైనల్‌లో డానియల్ మెద్వదేవ్, అల్కరాజ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఉమెన్స్ సింగిల్స్‌లో భాగంగా క్వార్టర్స్ పోరులో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 6-1, 6-4 తేడాతో చైనాకు చెందిన జెంగ్‌పై అలవోకగా నెగ్గింది. పదో సీడ్ చెక్ ప్లేయర్ ముచోవా.. 6-0, 6-3తో జర్మనీకి చెందిన క్రిస్టీని ఓడించింది.
వరుసగా రెండో సెమీస్‌లో బోపన్న..
భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌లు యూఎస్ ఓపెన్ సెమీస్‌కు అర్హత సాధించారు. ఈ జోడీ.. 7-6 (12-10), 6-1 తేడాతో అమెరికాకే చెందిన లామన్స్, విత్రోలపై ఘన విజయం సాధించింది. కాగా బోపన్న -ఎబ్డెన్ జంటకు ఇది వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ సెమీస్. కొద్దిరోజుల క్రితమే ముగిసిన వింబూల్డన్ టోర్నీలో కూడా ఈ ధ్వయం సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial