పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’
  


సౌత్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ఇవాళ(సెప్టెంబర్ 7న) విడుదల అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా విడుదలైంది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసి పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారు. సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో కామెడీ అందరినీ ఆకట్టుకుంటుందంటున్నారు. అంతేకాదు, ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కథాంశం చిన్నదే అయినా, కామెడీ అలరించిందంటున్నారు. ఈ సినిమాలో నవీన్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.


బాలయ్య అభిమానిగా ఆకట్టుకున్న జయసుధ  


ఇక ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క తల్లిగా జయసుధ నటించారు. ఎప్పటిలాగే ఆమె చక్కటి నటనతో ఆకట్టుకుంది. తల్లిగా ఒదిగిపోయిన నటించింది సహజ నటి. ఈ చిత్రంలో ఆమెను బాలకృష్ణ వీరాభిమానిగా  చూపించారు దర్శకుడు మహేష్ బాబు. బాలయ్య అంటే పడిచచ్చే అభిమానిగా ఆమె కనిపించారు. ఈ చిత్రంలో జయసుధ పాత్ర నటసింహం అభిమానులకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. ఇక ఇప్పటికే బాలయ్యతో కలిసి జయసుధ పలు చిత్రాల్లో నటించింది. పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన ‘అధినాయకుడు’లో జయసుధ నటించి మెప్పించింది. ఇందులో బాలయ్య 3 పాత్రలు చేయగా, అన్ని పాత్రలకు జంటగా జయసుధ నటించింది. ఒక బాలయ్యకు భార్యగా, మరో బాలయ్యకు తల్లిగా,  ఇంకో బాలయ్యకు నాయనమ్మగా నటించింది. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా, ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు.  బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తో పలు హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె బాలయ్యతో జతకట్టడం థ్రిల్‌ కల్గించిందని అప్పట్లో జయసుధ చెప్పింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాలు బాలయ్యతో కలిసి ఆమె స్ర్కీన్ షేర్ చేసుకుంది.


అనుష్క, నవీన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్!


ఇక అనుష్క కెరీర్ లో‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ 48వ చిత్రంగా వచ్చింది.  'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె నటించిన సినిమా ఇది. మరోవైపు 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‍ బాస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో నటించాడు.  సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం అంచనాలకు మించి పాజిటివ్ స్పందన అందుకుంటోంది. ఈ చిత్రంలో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వంశీ - ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి రధన్ సంగీతం సమకూర్చారు.


Read Also: ‘పఠాన్‘ను మించిన ‘జవాన్‌’, షారుఖ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచేనా? ఓవర్సీస్ ఆడియెన్స్ ఏమంటున్నారంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial