టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాభిమానులకు షాక్. స్వర్ణంతో స్వదేశానికి సగర్వంగా తిరిగి వస్తుందనుకున్న మాగ్నిషిసెంట్ మేరీ కోమ్ మేరీ కోమ్ రౌండ్-16లో ఓటమిపాలైంది. 48-52 కేజీల మహిళల ఫ్లై వైట్ విభాగంలో వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్ లొరనా చేతిలో మేరికోమ్ ఓటమి పాలైంది. దీంతో టోక్యో ఒలిపింక్స్‌లో మేరీకోమ్ పతకాల వేటకు తెరపడింది.
భారత అగ్రశ్రేణి బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. వీరిద్దరి మధ్య పోరు ఆసాంతం హోరాహోరీగా సాగింది. తనదైన శైలిలో ఆడిన వలెన్షియా తొలి రౌండ్లో న్యాయ నిర్ణేతలను మెప్పించింది.
ఐదుగురు జడ్జీలు ఆమెకు 49 పాయింట్లు ఇవ్వగా మేరీకోమ్‌కు 46 మాత్రమే కేటాయించారు. ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి సైతం అదే రీతిలో చెలరేగడంతో న్యాయనిర్ణేతలు ఇద్దరికీ సమానంగా స్కోర్ ఇచ్చారు. తొలిరౌండ్లో ఆధిక్యంతో వలెన్షియా క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లింది. ఇవే ఆఖరి ఒలింపిక్స్‌గా భావిస్తున్న మేరీకోమ్ ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో ఓటమి పాలైంది.
దీంతో మేరీకోమ్ బోరున విలపంచింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలన్న తన చిరకాల కలను ఎలాగైన సాకారం చేసుకుందామనుకున్న మేరీకోమ్ తన కలను కలగానే మిగిల్చేసుకుంది. మేరీ కోమ్ బాధను చూసి అభిమానులు కూడా బాధపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలను షేర్ చేస్తూ నీ పోరు అద్భుతం... మ్యాచ్ గెలవకపోయినా... నువ్వు మా మనసులు గెలిచావు’ అంటూ కామెంట్లు పెడుతూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఐదు సార్లు ఆసియా విజేత... ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్... ఒలింపిక్స్‌లో కాంస్యం... 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్... 38 సంవత్సరాల మేరీ కోమ్ బాక్సింగ్‌లో ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు. ఆమె కల అంతా ఒలింపిక్స్‌లో స్వర్ణమే. కానీ, విధి ఆమెకు అడ్డు తగిలింది. హోరాహోరీగా సాగిన పోరు చివర్లో రిఫరీ తన ప్రత్యర్థి చేయి పైకి ఎత్తగానే మేరీ ఒకపక్క నవ్వుతూనే.. తన బాధను భరించలేక బోరుమంది.
ప్రతీకారం తీర్చుకున్న ప్రత్యర్థి
వీళ్లిద్దరూ తలపడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరు 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో తలపడ్డారు. అప్పుడు వలెన్షియాను... మేరీకోమ్ తన పంచ్‌లతో ఓడించేసింది. కానీ, ఇప్పుడు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఆమె చేతిలోనే మేరీ కోమ్ ఓటమి చెందాల్సి వచ్చింది. కొలంబియా తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్ వలెన్షియానే కావడం గమనార్హం.